ప్రజాశక్తి-సీతమ్మధార : స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు ఆ-హబ్ (ఎయు ఇంక్యుబేషన్ సెంటర్), ఇపిడిసిఎల్ సంయుక్తంగా నిర్వహించిన ‘హాక్ ఏపీ హ్యాకథాన్’ కార్యక్రమంలో సృజనాత్మక ఆవిష్కరణలను అందించిన ఏడు బృందాలకు రూ.6 లక్షల విలువైన బహుమతులను ఎపిఇపిడిసిఎల్ సిఎమ్‌డి పృథ్వీతేజ్ ఇమ్మడి అందించారు. ఆంధ్రా యూనివర్సిటీ వేదికగా జరిగిన 13వ ఎడిషన్ ‘హాక్ ఏపీ హ్యాకథాన్’ కార్యక్రమంలో స్టార్టప్ సంస్థలతో పాటు విద్యార్థులు, నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో సహా 72 బృందాలు పాల్గొని విద్యుత్ పంపిణీ వ్యవస్థలోని సమస్యలకు పరిష్కారాలను ప్రదర్శించారు. హ్యాకథాన్ ద్వారా వచ్చిన పరిష్కారాలను అమలుచేయడం ద్వారా సంస్థ సుమారు రూ.2 కోట్లు ఆదా చేయగలుగుతుంది. ఈ సందర్భంగా సిఎమ్‌డి మాట్లాడుతూ వీరు అందించిన పరిష్కారాల ద్వారా సంస్థ మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ముఖ్యంగా విద్యుత్ ఘాతాలను నిరోధించేందుకు, ఫీడర్ మీటర్ల కమ్యూనికేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ముందస్తుగా నిర్వహణ వైఫల్యాలను గుర్తించుట, బిల్లింగ్ ప్రక్రియను సులభతరం చేయుట, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు దోహదపడతాయని వివరించారు. విఎంఆర్‌డిఎ కమిషనర్ కె.విశ్వనాధన్ మాట్లాడుతూ, విద్య, పారిశ్రామిక రంగాలను అనుసంధానించే దిశగా జరిపే ఇటువంటి హ్యాకథాన్ల నిర్వహణ ఎంతో అవసరమని తెలిపారు. తమ సంస్థలోని సమస్యల పరిష్కారం కోసం ఇటువంటి హ్యాకథాన్‌ను నిర్వహించేందుకు ఆ-హబ్‌ను స్వాగతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్లు వి.విజయలలిత, బి.రామచంద్రప్రసాద్, సిజిఎం డి.సుమన్, కళ్యాణి, ఆ-హబ్ సిఇఒ రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు.