హాస్టళ్లల్లో సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి కనిగిరి : హాస్టళ్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి సిహెచ్‌.వినోద్‌,ఉపాధ్యక్షుడు పాండు రంగారావు, డివైఎఫ్‌ఐ నాయకుడు నరేంద్ర కోరారు. హాస్టళ్ల సర్వేలో భాగంగాకనిగిరి పట్టణంలోని పలు హాస్టళ్లను బుధవారం సందర్శించారు. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌సి-2 బాలుర హాస్టల్‌ సమస్యలకు నిలయంగా మారిందన్నారు. బోరు చెడిపోవడంతో నీటి సమస్య ఉందన్నారు. మరుగుదొడ్లు మరమ్మతులకు గురైనట్లు తెలిపారు. గదులకు కిటికీలు లేవని తెలిపారు. తలుపులు విరిగిపోయి అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. హాస్టల్‌లో చేరిన విద్యార్థులు వసతులు లేని కారణంగా వెనుతిరిగి వెళ్లిపోతున్నారని తెలిపారు. ఎస్‌టి గురుకుల పాఠశాలలో 120 మంది విద్యార్థులకు ఐదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. కరెంటు తీగలు ఊడిపోవడం లైట్లు సక్రమంగా వెలగడం లేదన్నారు. హాస్టల్‌ పరిసరాలు శుభ్రంగా లేవన్నారు. ఉడికి ఉడకని భోజనం పెడుతున్నారని, అది తింటే విద్యార్థులు కడుపునొప్పి భారీపడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టళ్లలోని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

➡️