సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Oct 28,2024 21:35
ఫొటో : మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజాశక్తి-అనంతసాగరం : ప్రత్యేక ప్రజా విజ్ఞాపణల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతసాగరం మండల కేంద్రంలో సచివాలయాల ఉద్యోగులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గ్రామ మండలస్థాయి అధికారులు ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో భాగస్వాములై సహకరించాలన్నారు. స్థానిక సంస్థల పదవీకాలం 18నెలల్లో ముగుస్తున్నందున గ్రామాల అభివృద్ధికి కలసి రావాలన్నారు. అందరూ కూడా అభివృద్ధి పనుల్లో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. సచివాలయాల ఉద్యోగులందరూ తమకిచ్చిన ప్రొఫార్మా మేరకు గ్రామాల్లోని కుటుంబ సభ్యుల సమస్యలు, గ్రామాల్లో అవసరమైన పనులను నమోదు చేయాలని సూచించారు. ప్రజలు అందించిన అర్జీలపై అధికారులందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేకంగా ఈ విషయమై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అనంతసాగరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి సుమారు 1400 పైగా అర్జీలు వచ్చాయని, ప్రతి అర్జీని బాధ్యతగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అన్ని గ్రామాల్లో సుమారు రూ.10కోట్లతో 198 పనులను మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టామని, సోమశిలలో రూ.15లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మార్చి నాటికి పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బి రహదారులను గుంటలు లేని రహదారులుగా మారుస్తామన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సిఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా ఉదారంగా ఆర్థికసాయం అందించి అండగా ఉంటున్నామన్నారు. 6 మండలాలకు చెందిన 22మంది లబ్ధిదారులకు రూ.17.73 లక్షలు విలువైన చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో ఆత్మకూరు ఆర్‌డిఒ పావని, ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌, తహశీల్దార్‌ సుధీర్‌, జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు బొల్లినేని గిరినాయుడు, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, సునీత, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️