విజయవాడ (యన్.టి.ఆర్.జిల్లా) : రేపటి నుండి ఈ సంవత్సరాంతం వరకు యన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ 1861 ప్రకారం నిషేధాజ్ఞలు అమలవుతాయని ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎన్‌టిఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా సజావుగా శాంతిభద్రతలు పరిరక్షించడానికి పోలీస్ కమీషనర్ మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పోలీస్ కమీషనరేట్ పరిధిలో ది.01.10.2024వ తేదీ నుండి ది.31.12.2024వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం 92 రోజులు పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు. నిషేధాజ్ఞలు అమలు ఉన్న సమయంలో పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసన, ధర్నా కార్యక్రమాలను పోలీస్ వారి ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించకూడదని, నిషేధాజ్ఞలు అతిక్రమించి నిర్వహించినవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.