జిల్లాలో కూటమి సర్కారు తీరుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వైసిపి సర్కారు హయాంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కడప, విశాఖపట్నం జిల్లాలకు ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ పార్కులను కేటాయించింది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ యువతకు నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ పార్కులను కేటాయించింది. వైసిపి సర్కారు జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. 19.5 ఎకరాలను కేటాయించింది. కూటమి సర్కారు కొప్పర్తి ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ పార్కును సిఆర్‌డిఎకు తరలిస్తూ జిఒ జారీ చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. జిల్లాలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, విద్యా వంతులు, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మాజీ సిఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై ఉన్న స్పర్థతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదనే విమర్శ పెద్దఎత్తున వినిపిస్తోంది. ఆయన మాటలు, చేతలను గమనిస్తే స్పష్టమవుతోందనే విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాకు కొత్త ప్రాజెక్టులు ఇవ్వడం ఎవరికి ఎరుక, ఉన్న ప్రాజెక్టులను తన్నుకుపోవడం ఏవిధమైన రాజకీయమో ఆలోచించుకోవాలి. వివక్షా పూరిత వైఖరి ప్రజాస్వామ్యంలో మనజాలదనే సంగతిని గ్రహించాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా పర్యటనల సందర్భంగా కడప జిల్లాలో టిడిపికి ఒక్క ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించారని పదేపదే ప్రస్తావన చేయడం తెలిసిందే. వివక్షా పూరిత రాజకీయాల కారణంగానే ఇటువంటి ఫలితాలు వచ్చాయనే సంగతిని తెలిసి నటిస్తున్నారో, లేక జిల్లా ప్రజలను ఉద్దేశపూర్వకంగా మోసగించే నాటకం ఆడుతున్నారో తెలియడం లేదు. కులాలకు అతీతంగా ఆలోచన చేసి ఓటేయాలని పలుమార్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే. వివక్షా పూరిత రాజకీయాలే కారణమని గ్రహించాలి. లేనిపక్షంలో గత ఎన్నికల్లో లభించిన ఆ ఒక్క అసెంబ్లీ సీటు కూడా లభించని దుస్థితి దాపురించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధానిపై మీకు ప్రేమ ఉంటే కొత్త ప్రాజెక్టులు తెచ్చుకుని అభివృద్ధి పరచాలి. అటువంటి ప్రయత్నం చేయకుండా ఇతర ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలనే సంగతిని మరిచిపోయి. వాటికి కేటాయించిన ప్రాజెక్టులను తరలిస్తామనడం ఎంత వరకు సబబో ఆలోచించాలి. జిల్లాలోని టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలు సైతం ఎంఎస్‌ఎంఇ తరలింపును నిలువరించాలి. లేకపోతే ఇంతటితోనే రాజకీయ జీవితాన్ని మర్చిపోవాల్సి వస్తుందనే సంగతి గ్రహించాల్సిన అవసరం ఉంది. అసలే వెనుకబడిన జిల్లా. ఇటువంటి వెనుకబడిన జిల్లా నుంచి గతంలో కేంద్రం ఇచ్చిన ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ పార్కును తరలించాలనుకోవడం అవివేకమని గుర్తించాలి.- ప్రజాశక్తి – కడప ప్రతినిధి