ఫొటో : నిరసన తెలియజేస్తున్న మున్సిపల్ కార్మికులు
పెండింగ్ జీతాల కోసం నిరసన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో తమకు రెండు నెలల జీతాలు, పెండింగ్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ జీతాలు చెల్లించాలంటూ సిఐటియు నేతలతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బుధవారం నిరసన ధర్నా నిర్వహించారు. తమ జీతంతో పాటు గతంలో తమకు రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. కార్మికులకు అందించాల్సిన సబ్బులు, నూనెలు, యూనిఫారంలను అందించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్మికులతో పాటు మద్దతుగా ఆత్మకూరు పట్టణ సిఐటియు అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, సిపిఎం కార్యదర్శి డేవిడ్ రాజు ఈ నిరసనలో పాల్గొన్నారు. నినాదాలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ పనిచేస్తేనే పూటగడవని పరిస్థితుల్లో ఉంటే నెలలు తరబడి జీతాలు నిలుపుదల చేస్తే వారి పరిస్థితి ఏమిటని వెంటనే వారికి రావాల్సిన జీతాలతో పాటు గతంలో రావాల్సిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేశారు.