ప్రజాశక్తి-విజయనగరం కోట : కాంగ్రెస్ అధిష్టాన నాయకులపై అన్యాయంగా దుర్మార్గపు చార్జిషీట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. బిజెపి చర్యలను నిరసిస్తూ , కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా డిసిసి ఆధ్వర్యాన ఎసిబి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు ఎం.విద్యాసగర్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏకపక్ష క్రూరత్వ చర్యల్లో భాగంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ఏకపక్షంగా జప్తు చేయడం, కాంగ్రెస్ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ఎఐసిసి మాజీ అధ్యక్షులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇతర సీనియర్ నాయకులపై ఛార్జిషీట్లు దాఖలు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు. సత్యాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గేదెల తిరుపతి, గోగాడ శ్రీనివాసరావు, ముస్లిం మైనార్టీ నాయకులు షరీఫ్, ఎన్.శ్రీనివాసరావు, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
