ప్రజాశక్తి- తగరపువలస : పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ సిపిఎం భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక వై జంక్షన్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జోన్ కమిటీ నాయకులు రవ్వ నరసింగరావు మాట్లాడుతూ, ప్రజలు నిత్యం వాడే ఉప్పు, బియ్యం, పప్పు, వంటనూనె, ఉల్లి, టమోటా ఇలా నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రాము, జీరు సత్యారావు, పల్లా పెంటరాజు, పల్లా రమణ, డి శివ, రామకృష్ణ పాల్గొన్నారు
ఆనందపురం: పెరిగిపోతున్న ధరలను నియంత్రించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆనందపురం జంక్షన్‌లో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు రవ్వ నర్సింగరావు, నాగరాణి మాట్లాడుతూ నిత్యవసరాల ధరాభారంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్, నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలకు రెక్కలొచ్చాయని, ఏనాడూ తగ్గిన పాపాన పోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముద్దాడ రాము, పల్ల పెంటరాజు, ఒ.ప్రమీల, నారాయణమ్మ ,శివ రామకృష్ణ ముఠా కార్మికులు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్ : పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా, సిఐటియు జగదాంబ జోన్‌కమిటీల ఆధ్వర్యాన పూర్ణామార్కెట్ జంక్షన్‌లో మంగళవారం సాయంత్రం ‘బంగారు వర్ణ కూరగాయల’తో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జోన్ కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ, బండెడు డబ్బులు పట్టుకొని మార్కెట్‌కు వెళితే సంచెడు కాయగూరలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వందరోజులకే ప్రజలకు చుక్కలు చూపిస్తుదన్నారు. సిఐటియు నాయకులు కె.చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐద్వా నాయకులు వరలక్ష్మి, అన్నపూర్ణ సరోజిని, సిఐటియు నాయకులు ఎం. సుబ్బారావు, వై.రాజు పాల్గొన్నారు.
నిత్యావసర ధరలపై ఐద్వా నిరసన
పరవాడ: నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యాన మంగళవారం పరవాడ సంతలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం మాట్లాడుతూ ఉల్లిపాయలు, టమోటాలతో పాటు కొన్ని రకాల కూరగాయలు కిలో 100 రూపాయలు ఉండగా, ఏ కూరగాయలు రూ.80కు తగ్గకుండా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనుకునేందుకు భయపడుతునారని తెలిపారు. ధరలు ఇలా మండిపోతుంటే పేదలు, సామాన్యులు ఎలా కొనుక్కొని తింటారని ప్రశ్నించారు. మహిళలు, బాలికలు పౌష్టికాహారం లోపం వల్లే రక్తహీనతకు గురవుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం నిత్యవసర సరుకులను అదుపు చేయడంపై దృష్టి పెట్టాలని, రేషన్ డిపోల ద్వారా నిత్యవసర సరుకులు, కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు చుక్క దేవుడమ్మ, బంగారమ్మ, చిన్న దేవుడమ్మ, వరలక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.