ఎబిసి వంతెనపై రాకపోకలకు అనుమతించాలని ఆందోళన
ప్రజాశక్తి -ములగాడ : విశాఖ నావెల్ డాక్‌యార్డ్ ఉద్యోగి ఎం. దిలీప్‌కుమార్ శుక్రవారం షీలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. సాయంత్రం విధులు ముగించుకుని, పెందుర్తిలోని ఇంటికి వెళుతుండగా, డాక్‌యార్డు షీలానగర్ రోడ్డులో ప్రమాదానికి గురై మృతి చెందాడు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేవల్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సంఘటనాస్థలిలోనే మృతి చెందిన సహచర ఉద్యోగి దిలీప్‌కుమార్‌కు సంతాపం తెలిపారు. మృతదేహాన్ని కెజిహెచ్‌కు తరలించే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి డాక్‌యార్డు విజయనగర్ గేటు వద్దకు చేరుకుని నిరసన, ఆందోళన చేపట్టారు.
ఎబిసి వంతెనపై రక్షణ ఉద్యోగులను అనుమతించండి
నేవల్, డాక్‌యార్డులో పనిచేస్తున్న రక్షణ రంగ ఉద్యోగులను ఎబిసి వంతెనపై రాకపోకలకు అనుమతించాలని నేవల్ సివిలియన్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. షీలానగర్ వద్ద డాక్‌యార్డు ఉద్యోగి దిలీప్‌కుమార్ మరణంపై నిరసన వ్యక్తం చేస్తూ విజయనగర్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రక్షణరంగ ఉద్యోగులనైనా ఎబిసి వంతెన మీదుగా రాకపోకలకు అనుమతించాలని రెండు నెలలుగా రక్షణ మంత్రికి, నేవల్ ఉన్నతాధికారులకు, పార్లమెంట్ పిటిషన్ కమిటీకి, స్థానిక ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో నేవల్ డాక్‌యార్డు ఉద్యోగులు విధులకు వచ్చిపోయే ఉదయం సాయంత్రం వేళ్లలో భారీసంఖ్యలో హెవీవాహనాల రాకపోకలతో కిక్కిరిసిన డాక్‌యార్డు, షీలానగర్ రోడ్డులో ప్రయాణికం తప్పని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడడమే కాకుండా, తరచూ ప్రమాదాలకు గురవుతూ, రక్షణరంగ ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌బిసి వంతెన పైనుంచి అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను అనుమతిస్తున్న అధికారులు, తమను ఎందుకు వెళ్లనీయడం లేదని ప్రశ్నించారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు ఎవరు భరోసా,బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనకు సహకరించిన వందల సంఖ్యలో వాహనదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆందోళనకు యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, నాయకులు శేఖర్, కాశీం, భానోజీ, పరమేష్, నాగార్జున, రాజేష్, గణేష్, నాయుడు నేతృత్వం వహించారు.