ఉపాధి బిల్లులు చెల్లించాలని నిరసన

Jun 9,2024 22:10

ప్రజాశక్తి – పాచిపెంట : రెండేళ్ల క్రితం చేసిన ఉపాధి పనులకు బిల్లులు చెల్లించలేదని, అప్పటి నుండి ఇప్పటి వరకు పనులు ఇవ్వనందుకు నిరసనగా సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యాన మండలంలోని పాంచాలి పంచాయతీ సీతంపేటలో చింతజోరు చెరువు వద్ద గిరిజనులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీతంపేట గిరిజనులు డుంబిరి లచ్చయ్య, సాంబయ్య, రోడ్‌ జర్నీ, సోమయ్య, గంగరాజు, తవిటియ్య మాట్లాడుతూ రెండేళ్లు అయినా తమ గ్రామానికి ఉపాధి పనులు ఇవ్వలేదని, ఒక్కసారి కూడా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తమ గ్రామానికి రాలేదని తెలిపారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్లక్ష్యం వల్ల రెండేళ్ల క్రితం ముఖ్యచింత జోరు చెరువు, బొడ్డమాను జోరు చెరువు పనుల్లో దాదాపు నాలుగు వారాలు తమ గ్రామంలోని గిరిజనులమంతా పనిచేశామని, అయినా నేటికీ డబ్బులు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఈ విషయమై అధికారులకు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్లక్ష్యం వల్ల తమకు పనులు లేకపోవడంతో పస్తులతో ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని, ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి పనులు ఇచ్చి తమను ఆదుకోవాలని, తమకు రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికుల వలస నివారణకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనఉపాధి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, దీన్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2005లో వామపక్షాల కృషి ఫలితంగా వచ్చిన ఉపాధి చట్టాన్ని కేంద్రం ఒకపక్క నిర్వీర్యం చేస్తుంటే కొంతమంది అసమర్ధ అధికారుల నిర్లక్ష్యం వల్ల గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పనులు సక్రమంగా అమలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇకనైనా ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ మసస్యపై త్వరలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆ గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.

➡️