ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితుల కుల ధ్రువపత్రాలను వెంటనే అందించి కేసుల పరిష్కారానికి కృషి చేయాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ – మానిటరింగ్ కమిటీ సమావేశం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యుల కోరిక మేరకు ప్రతినెలా నాలుగో శనివారం కలెక్టరేట్‌లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామన్నారు. కమిటీ సభ్యుల ఉచిత బస్ పాస్, ఇళ్ల స్థలాల డిమాండును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదే సమయంలో అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా చూసే బాధ్యత సైతం కమిటీ సభ్యులపై ఉంటుందని గుర్తు చేశారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్‌కు సంబంధించి ఎస్సీ, ఎస్టీల సమస్యలను తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అట్రాసిటీ కేసుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజరు గనోరె, డీఆర్వో మురళి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఓబుల నాయుడు పాల్గొన్నారు.
విద్యుత్ ఎఇపై అట్రాసిటీ కేసు
ప్రజాశక్తి – నకరికల్లు : కులం పేరుతో దూషించారనే ఫిర్యాదుపై నకరికల్లు విద్యుత్ ఎఇపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. గతనెల 3వ తేదీన నకరికల్లు ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చింతపల్లి రాజు ఇంటిలో విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీనిపై సబ్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు రాజు వెళ్లగా ఎఇ నాగసురేష్ దురుసుగా మాట్లాడారని, విద్యుత్‌ను ఉచితంగా వాడుకుంటున్నది కాకుండా మళ్లీ ఇదొకటా.. అంటూ దుర్భాషలాడి కులం పేరుతో దూషించారని రాజు గతనెల 7న కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు విద్యుత్ శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే వారు విచాణేమీ చేయకుండానే ముగించడంతో బాధితుడు గతనెల 28న కలెక్టర్ గ్రీవెన్స్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టగా రాజు తండ్రి సంతకాన్ని విద్యుత్ శాఖాధికారులు ఫోర్జరీ చేసి ఫిర్యాదును ముగించినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీంతో ఎఇని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనంతరం రాజీ కోసం ఎఇ బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదుదారుడు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఈనెల 18న ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఇపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.