ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్ : ప్రధానమంత్రి జన్మన్ క్రింద గిరిజన నివాసిత ప్రాంతాల్లో గుర్తించిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రధానమంత్రి జన్మన్ (ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్), డా జుగా (ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్) పథకాల గుర్తించిన 11 అంశాలలో పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఓ ఐటిడిఎ వెంకట శివ ప్రసాద్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలోని 14 మండలాల్లో 48 గిరిజన నివాసీత ప్రాంతాల్లో పీఎం జన్మన్ కింద గుర్తించిన 11 అంశాలలో చేపట్టిన పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులను ఆదేశించారు. గూడెంలలో గృహ నిర్మాణాలకు సంబంధించి 527 ఇళ్లు మంజూరు కాగా వాటిలో కేవలం 92 మాత్రమే పూర్తి అయ్యాయని మిగిలిన గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హౌసింగ్ పిడిని ఆదేశించారు. ఇంటి స్థలాలు కేటాయించిన వారికి తప్పనిసరిగా పొసెషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలని, సదరు సర్టిఫికేట్ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అదనపు ఆర్థిక సహాయం వచ్చే అవకాశం ఉంటుందని సదరు విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. కొత్తపల్లిలో 38, పాములపాడులో 25, తదితర చెంచుగూడెంలలో 45 ఇళ్లు నూతనంగా మంజూరు అయ్యాయని వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కపిలేశ్వరం నుండి జానాల గూడెం వరకు వేస్తున్న 7.11 కి.మీ బిటి రోడ్డును వెంటనే పూర్తి చేయాలని, అదే విధంగా రోడ్లు లేని గ్రామాలు ఏవీ ఉండకుండా ఉపాధి హామీ ద్వారా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా అధికారులను ఆదేశించారు. ఆర్వబ్లూఎస్ కు సంబంధించి జల్ జీవన్ మిషన్ క్రింద పివిటిజిలకు త్రాగు నీరు ఇబ్బంది లేకుండా 53 పనులు మంజూరు చేయడం జరిగిందని, అందులో 11 మాత్రమే పూర్తి అయ్యాయని మిగిలిన వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వబ్లూఎస్ ఎస్ఈని ఆదేశించారు. అదే విధంగా సున్నిపెంట గ్రామంలో త్రాగునీటి అవసరాల కోసం ప్రభుత్వానికి రూ.2,813 కోట్లతో డిపిఆర్ పంపడం జరిగిందన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా తక్షణ చర్య నిమిత్తం డిఎంఎఫ్ క్రింద 40 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన గూడెంలలోని గిరిజనులకు ఎప్పటికపుడు వైద్య సదుపాయాలు అందజేసేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎంజెఎవై కార్డుల ద్వారా 5 లక్షల వరకు దేశంలో ఎక్కడైనా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంటుందని, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 25 లక్షల వరకు రాష్ట్రంలో ఉచితంగా వైద్య చికిత్సలు పొందే అవకాశం ఉన్నందున చెంచుగూడెంలోకి ప్రజలు అందరికీ సదరు కార్డులు అందజేయాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. సమగ్రశిక్ష ద్వారా వెలుగోడులో వంద పడకలు, కొట్టాలచెరువులో 50 పడకల కస్తూరిబా పాఠశాలల వసతి గృహాలకు భూమి పూజ చేశామని సదరు వసతి గృహాలను రానున్న విద్యా సంవత్సరం నాటికి పూర్తి చేయాలని సమగ్రశిక్ష అధికారిని, పిఓ ఐటిడిఎను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా వసతి గృహం నుండి పాఠశాల ఎక్కువ దూరంలో ఉంటే రవాణా సదుపాయం ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అవసరం ఉన్న చోట అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అందుకు 3 నుండి 5 సెంట్లు స్థలాన్ని గుర్తించాలని, స్థల సేకరణ సంబంధించి ఎటువంటి సమస్యలు ఉంటే తహశీల్దార్లను తెలియజేయాలన్నారు. మార్కెటింగ్ కు సంబంధించి శ్రీశైలం ట్రైబల్ మ్యూజియం సమీపంలో మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్ ఏర్పాటు కోసం కోటి రూపాయలు మంజూరు కావడం జరిగిందని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు. జనాలగూడెంలో విద్యుత్ లేకపోవడం వల్ల సుమారు 7 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసి గ్రామానికి విద్యుత్ సరఫరా చేసినందుకు కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారిని అభినందించారు. మొబైల్ టవర్ల ఏర్పాటు కోసం కొత్తపల్లి మండలం, ఎర్రమట్టంలో స్థలం గుర్తించి బిఎస్ఎన్ఎల్ వారికి అందజేశారని, నాగలూటి, పెచ్చరువు ప్రాంతాల్లో ఎయిర్టెల్ వారు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని తగు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఓను కలెక్టర్ ఆదేశించారు. డా జుగా (ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్) పథకం క్రింద ఆత్మకూరు మండలంలోని బైర్లూటిగూడెం, రాళ్ల కొత్తూరు గ్రామాలు, బనగానపల్లె మండలం గులమాలియాబాద్ తాండాలలలో గుర్తించిన 18 మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సివిల్ సప్లైస్ కు సంబంధించి ఇంకా 166 గ్యాస్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని దీపం పథకం క్రింద అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిఎస్ఓను ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి వ్యవసాయంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని తద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా లబ్ధిదారుల అర్హత మేరకు పశుసంపదను మంజూరు చేయడంతో పాటు పశుగ్రాసాన్ని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక, డ్వామా పిడిని కలెక్టర్ ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషన్ వాటికలు ఏర్పాటు చేసి వాటిలో మెడిసినల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా చెంచుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నైపుణ్య అభివృద్ధి అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
