ప్రజాశక్తి- దేవనకొండ : రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాయి. ఈ నేపథ్యంలో ఆకాశాన్నంటిన ధరలు, పెరుగుతున్న విద్యుత్ భారాలు, గ్రామీణ ప్రాంతాల్లో అద్వానమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సిసి రోడ్లు లేవని, త్రాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ, బి వీరశేఖర్ లు పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో ప్రజా చైతన్య యాత్రను కుంకునూరు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిందని. ఈ యాత్రలో ప్రజలు పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని వారు కోరారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, బడ్జెట్లో రాయితీలు ఏమైనా ప్రకటిస్తారని 9 నెలలుగా ఆశతో ఎదురుచూసిన ప్రజలకు నిరాశ ఎదురయిందన్నారు. ఈ ప్రభుత్వానికి కూడా మాటలకు చేతలకు పొంతన లేదని విద్యుత్ ఛార్జీలు ఒక రూపాయి పెంచనని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల నుండే విద్యుత్ భారాలు వేయడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ 16 వేల కోట్లు విద్యుత్ భారాలను ప్రజలపై వేశారని… స్మార్ట్ మీటర్లు పగలగొట్టండన్న చంద్రబాబు గుట్టుచప్పుడు కాకుండా స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని…సూపర్ సిక్స్ పథకాల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు, నెలకు 1500 రూపాయలు, చదువుకున్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రస్తావన బడ్జెట్లో కనబడలేదని ఢిల్లీ లో కూటమి ప్రభుత్వమని పోయినపుడల్లా బిజెపి నాయకులను ప్రసన్నం చేసుకోవడం ఎలా అనే తపన తప్పా రాష్ట్ర అభివృద్ధి కొరకు, విభజన హామీల్లో ప్రకటించిన ప్రకారం నిధులు రాబట్టుకోవడంలో శ్రద్ధ కనబరచడంలేదుని విమర్శించారు. హంద్రీ నీవా పెండింగ్ పనుల పూర్తి , పంట కాలువ నిర్మాణం ,గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాట్ పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు విమర్శించారు. సాగు, తాగునీరు మౌలిక సదుపాయాల పై ప్రభుత్వాల తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నాయని ఈ నేపథ్యంలో ప్రజా చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలపై ఈ నెల 28వ తేదీన మండల కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు యం.అశోక్ స్థానిక నాయకులు కే. శ్రీనివాసులు, సింహాద్రి ,వెంకటేశ్వర్లు, వీరేంద్ర, సూర్యచంద్ర తోపాటు గ్రామ ప్రజానీకం పాల్గొన్నారు.
