కొణిజేడులో ప్రజా చైతన్య యాత్ర

ప్రజాశక్తి-టంగుటూరు: సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బృందం సోమవారం టంగుటూరు మండలం కొణిజేడు గ్రామంలో పర్యటించింది. ఈ బందంలో సిపిఎం జిల్లా నాయకులు వి బాలకోటయ్య, టి రాము, వి మోజెస్‌, ఎస్‌కె మీరాస్‌, ఎం కోటయ్య ఉన్నారు. కొణిజేడు గ్రామంలో గిరిజన కుటుంబాలు సుమారు 30 ఉన్నాయి. వీరు క్లీనింగ్‌ పనులు, గాజులు, పూసలు అమ్ముకోవడం, ఇతర కూలి పనులు చేసుకొంటూ జీవిస్తుంటారు. వారిలో కొంత మందికి గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మిగిలిన వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని కాలనీ వాసులు సిపిఎం బృందానికి తెలిపారు. దీని వల్ల కరెంట్‌ మీటర్లు కూడా లేక చీకట్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాలు కట్టుకొనే స్తోమత లేక పట్టలతో గుడారాలు వేసుకొని జీవిస్తున్నామని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. అలాగే హైస్కూల్‌ ప్రహరీ గోడ దగ్గర ఉన్న ఎస్‌సి కాలనీలో కొన్ని కుటుంబాలకు మంచి నీటి కుళాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం కాలనీ వాసులు సిపిఎం బృందం దృష్టికి తెచ్చారు. 100 మీటర్ల పైపులైన్‌ వేస్తే అక్కడున్న కుటుంబాలకు కూడా మంచి నీటి కుళాయిలు బిగించవచ్చు. ఈ సమస్యను కూడా వెంటనే పరిష్కరించాలని సిపిఎం బృందం డిమాండ్‌ చేసింది.

➡️