17 వరకు ప్రజా చైతన్య యాత్రలు

Mar 10,2025 00:19

సమవేశంలో మాట్లాడుతున్న సిహెచ్‌.బాబూరావు
ప్రజాశక్తి-గుంటూరు :
ప్రజా సమస్యలపై ఈనెల 8 నుండి 17వ తేదీ వరకూ సిపిఎం చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌.బాబూరావు కోరారు. బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జిల్లా విస్తృత సమావేశం ఆదివారం జరిగింది. సి.హెచ్‌.బాబూరావు మాట్లాడుతూ ప్రజాచైతన్య యాత్రలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి దశల వారీగా ఆందోళన చేయునున్నట్లు తెలిపారు. కేంద్రలో బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు పెద్దఎత్తున పెరిగిపోయాయని, మరోవైపు ప్రజలకు ఉపాధి లేక జీవన ప్రమాణాలు తగ్గుతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగం నానాటికి దివాళతీస్తోందని, 60 శాతం మంది జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, సేవారంగాలకు, సామాజిక రంగాలకు, విద్య, వైద్య రంగాలకు నిధులు తగినవిధంగా కేటాయించలేదని వివరించారు. కార్మికవర్గం దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. జమిలీ ఎన్నికల పేరుతో రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పేదలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సూపర్‌-6 పథకాలకు బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, స్కీమ్‌ వర్కర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గుంటూరు ఛానల్‌ పొడిగింపు, నల్లమడ ఆధునీకరణకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, పెదవడ్లపూడి హైలెవెల్‌ను పూర్తిచేయాలని, మిర్చి, వరి, పొగాకు, శనగ పంటలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 23న భగత్‌సింగ్‌ వర్ధంతి సభలు ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, ఎం.రవి, కె.నళినీకాంత్‌, బి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు డి.శ్రీనివాసకుమారి, ఎల్‌.అరుణ పాల్గొన్నారు.

➡️