ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్రమహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శి రంగరాజన్
ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఎఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ రంగరాజన్ పిలుపునిచ్చారు. ఎఐఎస్‌ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు బుధవారం నగరంలో ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కె.రామకృష్ణ మాట్లాడుతూ ఎన్‌ఇపితో విద్యావ్యవస్థను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నాశనం చేస్తున్నాయని అన్నారు. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో రంగరాజన్ మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్య వ్యవస్థ ప్రైవేటీకరణ, కార్పొరేటీ కరణ, కాషాయీకరణ గా మారిపోతోందన్నారు. జాతీయ విద్యా విధానంతో ఫెడరల్ వ్యవస్థతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనమవుతుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌ఇపిని వ్యతిరేకించి రాష్ట్రాల విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, కె.శివారెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పాఠ్యాంశాలలో మత భావాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు చేర్చుతోందని మండిపడ్డారు. నూతన విద్యా విధానం పేరుతో 52 వేల ప్రభుత్వ పాఠశాలలను మూత వేయడానికి కుట్ర చేశారని ధ్వజమెత్తారు. విశ్వ విద్యాలయాల్లో ఫెలోషిప్, స్కార్ షిప్పులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు. దేశంలో విద్యా హక్కు స్వేచ్ఛ కోసం రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనేక మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న విశాఖప్లాంట్‌ను ఏడు ప్రైవేటీకరణ చేయాలని చూడడం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను కాపాడుకునేందుకు విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసి ఉరికొయ్యలపై వేలాడిన భగత్ సింగ్, అల్లూరి పోరాటాలద్వారా, వీరేశలింగం పంతులు, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వివేకానంద, గురజాడ రచనలు, మాటలు, పాటల ద్వారా ఏ విధంగా దేశ స్వాతంత్య్రానికి, ఐక్యతకు కృషి చేశారో విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా తన గేయాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్య్వర్గ సభ్యులు పి. కామేశ్వరరావు, జిల్లా కారక్యదర్శి ఒమ్మి రమణ, నాయకులు బుగత ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. అనరతరం ప్రతినిధుల సభ ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రారంభమైంది. తొలుత అమరుల స్థూపం వద్ద సిపిఐ నాయకులు, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు నివాళులర్పించారు.