సిపిఎం పోరాటంతో పోడ్డుపట్టాలు, ఇళ్ల స్థలాలు సాధించిన గిరిజనులు, పేదలు
ఎర్రజెండా అండతో నిర్వాసితులకు న్యాయం
అక్రమ వాటర్‌ప్లాంట్లపై అలుపెరుగని పోరు
స్థానిక సమస్యలపై ఎక్కడికక్కడ ఉద్యమాలు
16,17 తేదీల్లో సిపిఎం జిల్లా 10వ మహాసభలు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ప్రజాసమస్యలే అజెండాగా ముందుకు సాగుతున్న సిపిఎం గడిచిన మూడేళ్లలో ప్రజలకు ఎంతో అండగా నిలిచింది. ఓవైపు ముందుకొచ్చిన సమస్యలపై పోరాడుతునే ఇంకోవైపు పేదలపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగాను, వారి హక్కుల పరిరక్షణకు, సమసమాజం కోసం శక్తిమేర పోరాడుతోంది. గత మూడేళ్ల కాలంలో ముఖ్యంగా పేదలు, దళితులు, గిరిజనులు సాగుచేస్తున్న భూములపై హక్కు కల్పించాలని, ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని పెద్దఎత్తున పోరాడింది. నిర్వాసితుల పక్షాన నిలిచి వారికి మెరుగైన నష్టపరిహారం అందేలా కృషిచేసింది. ఇలా ఒకటీ రెండూ కాదు. ఎన్నో చోట్ల స్థానిక సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపింది. ఈనెల 16,17తేదీల్లో విజయనగరం కేంద్రంగా జరగనున్న 10వ జిల్లా మహాసభల నేపథ్యంలో సిపిఎం ఉద్యమాలు, విజయాలపై అందిస్తున్న కథనమిది.
గత మూడేళ్లలో ముందుకు వచ్చిన ప్రతి సమస్యపైనా సిపిఎం పోరాట గళం విపిపించింది. ముఖ్యంగా పేదలపై భారాలు మోపిన ప్రతి సందర్భంలోనూ వారి గొంతైంది. భూముల పరిరక్షణకు, ఇళ్లు, ఇళ్లపట్టాలు, సాగు భూమికోసం ఎక్కువగా ఉద్యమించింది. వంగర మండలం తలగాం దళితుల సాగులోని భూములను స్థానిక పెత్తందారులకు కట్టబెట్టడంపై పోరాడింది. దిగివచ్చిన ప్రభుత్వం పెత్తందారులకు ఇచ్చిన పట్టాలను రద్దుచేసింది. ప్రస్తుతం ఆ భూమిని స్థానిక దళితులు, ఇతర పేదలకు ఇవ్వాలని పోరాడుతోంది. వంగర మండలం పెద్దశిర్లాంలోని 50దళిత కుటుంబాలు సాగుచేస్తున్న భూములపై హక్కు కల్పించాలని పోరాడింది. ఇటు ఎస్.కోట, మెంటాడ, వేపాడ మండలాల్లో గిరిజనులకు పోడుపట్టాలివ్వాలని ఆందోళన చేపట్టింది. విజయనగరం, నెల్లిమర్ల నగర పంచాయతీలో పేదల కోసం నిర్మించిన టిడ్కోఇళ్లను అప్పగించాలని లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టింది. ఫలితంగా కొంతమేర ఇళ్లను అప్పగించారు. మిగిలిన వాటితోపాటు బొబ్బిలిలోనూ పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో సిపిఎం ముందుకు కదులుతోంది. సహరా ఇండియాలో పొదుపు చేసిన వారు జిల్లాలో వేలాదిగా నష్టపోయారు. వీరిని అక్కున చేర్చుకుని, వారి ఖాతాల్లో డబ్బులు జమచేయాలంటూ కొత్తవలస, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది.
సిపిఎం సమర భేరీ పేరిట చెత్తపన్ను, విలువ ఆధారిత ఆస్తిపన్ను, నీటి పన్ను రద్దుచేయాలని, పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు మానుకోవాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎన్నో నిరసనలు, ధర్నాలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రజారక్షణ భేరీ పేరిట, జిల్ల్లాలో రెండు బృందాలు జిల్లాలో జీపుజాతా నిర్వహించాయి. జిల్లా అభివృద్ధికి కీలకమైన సూచలు ప్రభుత్వానికి చేశాయి. ఈ కార్యక్రమాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, లోకనాధం కూడా పాల్గొన్నారు.
నిర్వాసితులకు అండగా…
జిల్లాలో రహదారులు, రైల్వే ట్రాకులు, సాగునీటి ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన రైతులు, ఇతర ప్రజానీకానికి సిపిఎం అండగా నిలిచింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే కారణంగా మెంటాడ, గంట్యాడ, విజయనగరం తదితర మండలాల్లో భూమి కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం కోసం పోరాడింది. కొత్తవలస, జామి, విజయనగరం, గజపతినగరం మీదుగా అటు బొబ్బిలి వరకు చేపట్టిన మూడో రైల్వే ట్రాక్ నిర్మాణం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైప్ లైన్ వల్ల భూములు కోల్పోయినవారికి న్యాయం జరిగేలా పోరాడింది.
రైతు సేవలో…
రైతులకు సబ్సిడీలు పెంచాలని, ధాన్యం, పత్తి, మొక్కజొన్న, చెరకు తదితర వ్యవసాయ ఉత్పత్తులపై మద్ధతు ధర పెంచాలని, ధర, తూకరలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని, మార్కెట్ సదుపాయాన్ని పెంచాలని డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యాన నిరంతరం పోరాటలు జరుగుతునే ఉన్నాయి. మరోవైపు తోటపల్లి, రామతీర్థసాగర్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని, గుర్ల గెడ్డను నిర్మించాలని, ఇతర జలాశయాలను ఆధునీకరించాలని నిరంతరం డిమాండ్ చేస్తునే ఉంది.
భూగర్భ జలాల పరిరక్షణ – అందరికీ ఉచిత తాగునీరు
భూగర్భ జలాల పరిరక్షణ – అందరికీ ఉచిత తాగునీరు అనే లక్ష్యంతో జిల్లాలోని అక్రమ వాటర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా సిపిఎం పెద్ద ఎత్తును ఉద్యమించింది. తొలుత విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని అయ్యప్పనగర్‌లో ప్రారంభించిన ఈ ఉద్యమం జిల్లా వ్యాప్తంగా విస్తరించింది. అయ్యప్పనగర్‌లో చేపట్టిన పోరాటానికి అప్పటి వైసిపి ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలిచినప్పటికీ సిపిఎం నాయకులు వెరవలేదు. దీంతో, నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. చివరకు ఆ ప్లాంట్‌తోపాటు ఆక్రమ ప్లాంట్లన్నీ సీజ్‌చేయాలంటూ సాక్షాత్తు న్యాయస్థానమే తీర్పునిచ్చింది.
స్టీల్‌ప్లాంట్ రక్షణలో
సిపిఎం విశాఖ స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం మన జిల్లాలో సైతం నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ప్లాంట్ నుంచి వచ్చిన బైకు యాత్ర, జీపుజాతా కార్యక్రమాల్లో కేవలం స్టీల్‌ప్లాంట్ కార్మిక కుటుంబాలే కాకుండా శక్తి మేర జిల్లా వాసులను పాల్గొనేలా చేసింది. సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసింది. విజయనగరంలో జరిగిన సభకు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరయ్యారు.
మైథాన్‌పై పోరాటంలో 40మంది జైలు జీవితం
బొబ్బిలిలో మైథాన్ యాజమాన్య నిరంకుశ విధానాలపై పోరాడిన కార్మికులపై అప్పటి ప్రభుత్వం 40మంది మహిళలు, సిపిఎం నాయకులపై అక్రమ కేసులు బనాయించింది. విశాఖ సెంట్రల్ జైలుకి పంపింది. చివరికి కార్మికుల సమస్య పరిష్కారమైంది.