ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి

ప్రజాశక్తి-చీరాల : మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ నిధులతో 31 వార్డు విజిలిపేట దండుబాటలో సుమారు రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణాన్ని నిలుపుదల చేసి ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ భూములను పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక సీనియర్‌ సిటీజన్స్‌ కార్యాల యంలో వామపక్ష ప్రజాసంఘాల నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు మాట్లాడతూ ఈ ప్లాంట్‌కు అతి సమీపంలో సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో సుమారు 5000 మంది చిన్నపిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు. ఈ ప్లాంట్‌ చుట్టూ 15,000 మంది దళితులు, గిరిజనులు నివాసముంటున్నా రన్నారు. కేవలం 70 మీటర్లు దూరంలోనే 500 కుటుంబాలు నివశిస్తున్నారని, ప్లాట్‌ నిర్మాణం ఇక్కడ చేపట్టడం ప్రకృతి విరుద్ధమని అన్నారు. పంట పొలాలు కూడా ఈ నీటివల్ల కలుషితం అవుతున్నట్లు తెలిపారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కావున ప్లాంట్‌ నిర్మాణాన్ని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నా కేవలం కాంట్రాక్టర్లు ప్రయోజనాల కోసం అధికారు లు మొండిగా అక్కడే ప్లాంట్‌ నిర్మాణం చేయతల పెట్ట డం దుర్మార్గం అన్నారు. తక్షణమే అధికారులు ప్రయ త్నాలు విరమించుకోకుంటే ఆందోళన తప్పదు అని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు ఇళ్ళు స్థలాలకు ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్‌ బాబురావు, సీపీఐ నాయకులు ఎమ్‌ వెంకట్రావు, చీరాల అభివృద్ధి సాధన సమితి నాయకు లు శీలం రవికుమార్‌, ఏ బాబురావు, సీనియర్‌ సిటీజన్స్‌ నాయకులు ఏ రామారావు, జి హరిహరరావు పాల్గొన్నారు.

➡️