ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమం మున్సిపాలిటీలోని 7,8 వార్డుల్లో మంగళవారం జరిగింది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆయా వార్డుల్లోని ప్రజలతో మాట్లాడారు. స్థానికంగా ఇబ్బంది కలిగే సమస్యలు తెలుసుకున్నారు. కొందరికి వితంతు పింఛన్లు రావడం లేదని, కొత్తగా రేషన్‌ కార్డులు అవసరమని ఎమ్మెల్యే కందుల దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్ల సమస్య తొందరలో తీరుతుందని సమాధానం ఇచ్చారు. సాగర్‌ నీటి పైప్‌లైన్లు లీకేజీలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. మురుగు కాలువలు అపరిశుభ్రంగా ఉన్నాయి. రహదారులు సక్రమంగా లేవు. ఈ సమస్యలపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ డివిఎస్‌ నారాయణరావును ఆదేశించారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్‌ యక్కలి కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కనిగిరి బాలవెంకటరమణ, టిడిపి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️