ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ గురించి ప్రజాప్రతినిధులకు సమాచారం తెలపాలి

ప్రజాశక్తి – భట్టిప్రోలు : గ్రామాలలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల గురించి తప్పనిసరిగా ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని ఎంపిపి డివి. లలితకుమారి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపిపి అధ్యక్షతన మండల సర్వసభ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ అధికారులు ఫ్రొటోకాల్‌ పాటించడం లేదని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు చేరితే ఫలితం ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులుకు తెలియకుండానే అధికారులు అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి ఎంపిటిసిలకు తెలియజేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులపై ఉందన్నారు. ఎంపిటిసి మురుగుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐలవరం ఆరోగ్య ఉప కేంద్రం మరియు పాఠశాల సమీపంలో మద్యం బెల్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ఎక్సైజ్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టి పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం సమీపంలో బెల్టు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బెల్టు షాపు తొలగింపు తక్షణమే చర్యలు చేపట్టాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులను ఎంపిపి ఆదేశించారు. తొలుత ఎంపిడిఒ ఎస్‌.వెంకటరమణ అజెండాలోని అంశాలను చదివి వినిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో అభివద్ధి పనులపై చర్చించలేదు. వివిధ శాఖల పనితీరుపై రిపోర్టు చదివి వినిపించారు. పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని విద్యాశాఖ అధికారులను ఎంపిపి ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్‌పిటిసి టి.ఉదయభాస్కరి, ఎంపిడిఒ ఎస్‌.వెంకటరమణ, వైస్‌ఎంపిపి కె.పిచ్చయ్య శాస్త్రి, ఎం. ఉషారాణి ,ఎఒ జలజ, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

➡️