ప్రజాశక్తి- వేపగుంట : విద్యుత్, నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపునిచ్చారు. సిపిఎం గోపాలపట్నం జోన్ 9వ మహాసభలను నాయుడుతోటలోని కృష్ణాది కళ్యాణ మండపంలో నిర్వహించారు. మహా సభలు ప్రారంభ సూచికగా పార్టీ సీనియర్ నాయకులు శాస్త్రీ జెండా ఎగురవేశారు. అనంతరం సీతారాం ఏచూరి, జిఎంఎస్ భాషా, పి.సత్యనారాయణ చిత్రపటాలకు పి.వెంకటరెడ్డి ఆధ్వర్యాన పూలమాలలు వేసి నివాళులర్పించారు. వి.ప్రభావతి, జి.శంకరరావు అధ్యక్షతన జరిగిన సభలో జగ్గునాయుడు మాట్లాడుతూ, ట్రూ ఆఫ్ చార్జీ పేరుతో రూ.16 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రభుత్వం వేసిందని తెలిపారు. ఇసుక కొరతతో బిల్డింగ్ కార్మికులకు పని లేకుండా చేశారని విమర్శించారు. పేదల నివాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్-6 పథకాలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని విమర్శించారు. పిపిపి పేరుతో హాస్పిటళ్లను ప్రయివేటు వారికి దారాదత్తం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ప్రజల పక్షాన పోరాడేది సిపిఎం మాత్రమేనని తెలిపారు. ప్రజలను చైతన్యం చేసి పోరాటానికి సిద్ధంగా కావాలని కోరారు. సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, సిపిఎం పోరాట ఫలితంగా చెత్త పన్ను రద్దయిందని గుర్తుచేశారు. సభలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ పాల్గొని ప్రసంగించారు.తీర్మానాలు పంచ గ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని, కొండవాలు ప్రాంత నివాసాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కొంతకాలంగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి పన్నులు, పట్టాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, ఆసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థలు అమ్మకం ఆపాలని, అధిక ధరలను అరికట్టాలని, ఉపాధి కోసం కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. డిసెంబర్ 28, 29 తేదీల్లో సుజాతనగర్‌లో జరిగే విశాఖ జిల్లా మహాసభలను జయప్రదంగా నిర్వహించాలని తీర్మానం చేశారు. జోన్ కార్యదర్శిగా జగన్ ఎన్నిక మహాసభలో సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా బి.జగన్, కమిటీ సభ్యులుగా బి.రమణి, బి.వెంకటరావు, కె.వెంకటలక్ష్మి, జి.శంకరరావు, సిహెచ్.తిరుపతిరావు, ఎస్.శంకరరావు, డి.లావణ్య, వి.ప్రభావతి, ఎస్.విజయలక్ష్మి, పి.అనసూయ, ఎం.ప్రసాద్, వి.రాజు, జక్కన సత్యనారాయణ, ఎస్.పద్మ ఎన్నికయ్యారు.