ఎసిసి కార్మికుల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న పాశం రామారావు
ప్రజాశక్తి-తాడేపల్లి : ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల దీక్ష శిబిరాన్ని ప్రజాపోరు ప్రచార యాత్ర బృందం సందర్శించి మద్దతు తెలిసింది. ఈ సందర్భంగా సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ సరైన ఉపాధి లేక సామాన్య ప్రజలు, కార్మికులు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వాలు నిత్యావసర సరుకులు ధరలు ఇబడి ముబ్బడిగా పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల మీద ప్రభుత్వాలు నియంత్రణ కోల్పోయాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు తగ్గటం లేదని దుయ్యబట్టారు. జమిలి ఎన్నికల పేరుతో రాష్ట్రాల హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ఉన్న సహకార సంఘాల ఎన్నికలను వివిధ రకాల పేర్లు చెప్పి కేంద్ర ప్రభుత్వం వాయిదా వేస్తుందని గుర్తు చేశారు. మతాన్ని రాజకీయాలకు జొప్పించి బిజెపి మానవ హననానికి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఉచిత ఇసుక విధానం అంటూనే గత ప్రభుత్వంలో మాదిరిగానే నేటి కూడా ఇసుక బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోందని, సరైన ఉపాధి దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై, బాలికలపై హత్యలు, లైంగిక దాడులు జరగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. వ్యవస్థలన్నిటినీ గత ప్రభుత్వం నాశనం చేసిందని చెబుతున్న సిఎం చంద్రబాబు… వాటిని బాగు చేయడానికి తీసుకుంటున్న చర్యలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై 14న తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు ప్రజలు తరలిరవాలని పిలుపునిచ్చారు. సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడుతూ సిమెంట్ ఫ్యాక్టరీ స్థలాల్లో కార్మికులు పక్కా ఇళ్లు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీ కార్మికుల న్యాయమైన సమస్యను ప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకర్‌రావు, సిపిఐ (ఎంఎల్) నాయకులు కె.ఆదినారాయణ, కార్మికులు వై.యశోవ, నాగేశ్వరరావు, ఆశీర్వాదం, బి.అంకయ్య, సుబ్బారావు, శారద, ఇమాంబి, సాంబయ్య, నాయక్ పాల్గొన్నారు.