రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సాయం : పురందేశ్వరి
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ‘గావ్ చలో అభియాన్’ (పల్లెకు పోదాం చలో) కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పాలడుగు గ్రామానికి గురువారం వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నిధులు కేటాయిస్తోందని, కొత్త రైల్వే లైన్లకు, జాతీయ రహదారులు, అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే ఎక్స్‌ప్రెస్ హైవే రహదారులు అనుమతి ఇస్తోందని చెప్పారు. రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల సాయం చేస్తుందన్నారు. పోలీసులపై మాజీ సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, నాయకులు బాషా, బి.శివన్నారాయణ, ఎ.వెంకటరమణ, వైవి సుబ్బారావు పాల్గొన్నారు.
