ప్రజాశక్తి – కారంపూడి : కూలీ, నాలి చేసి కుటుంబాన్ని ఒంటిచేత్తో నెట్టుకొచ్చిన యువకుడు ఇప్పుడు అచేతనంగా మిగలడంతో ఆ కుటుంబం కుమిలిపోతోంది. ఒకప్పుడు తమను పోషించిన వారు ఇప్పుడు తమకే భారంగా మారడం నిత్యం కన్నీరు పెట్టిస్తోంది.. కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కాకానివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వర్ల్ల సాగర్‌కు పట్టిన దీన దుస్థితిపై వివరాల ప్రకారం.. సాగర్ కరెంటు పనులు చేసుకుంటూ విద్యుత్ మీటర్ రీడింగులు తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాదిన్నర క్రితం పెదకొదమగుండ్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి రథోత్సవం సందర్భంగా విద్యుత్ తీగల తగులుతాయని విద్యుత్ నిలిపేయాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులు కోరారు. అప్పటికే తన వ్యక్తిగత పనులు మీద అత్తగారి ఊరైన చేజర్లకు వెళ్లిన సాగర్‌కు విద్యుత్ అధికారులు ఫోన్ చేసి తక్షణమే పెద్దకొదమగుండ్లకు రావాలని చెప్పారు. అయితే తాను అత్తగారి ఊరొచ్చినట్లు సాగర్ చెప్పినా వినిపించుకోని అధికారులు ‘నువ్వు రాకుంటే నీకు పని లేకుండా చేస్తాం’ అని అప్పటి విద్యుత్ అధికారులు వెంకటేశ్వర్లు, పరబ్రహ్మ చారి, రవి హెచ్చరించిన్నట్లు సాగర్ తెలిపాడు. విద్యుత్ రీడింగ్‌లు కూడా తీయకుండా చేస్తామని బెదిరించారని చెబుతున్నాడు. అధికారుల హుకుంతో తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ అదేరోజు పెద్ద కొదమగుండ్లకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా అవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి సాగర్‌ను స్తంభం ఎక్కించారు. సాగర్ స్తంభమెక్కిన మరుక్షణమే విద్యుత్ షాక్‌కు గురై కిందపడంతో తీవ్రగాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన అధికారులు ఎంత ఖర్చైనా భరిస్తామని నాడు సాగర్ కుటుంబీకులను నమ్మించారు. వైసిపి నాయకులు సమక్షంలోనూ మంతనాలు జరిపి వైద్యం ఖర్చులు భరిస్తామని, ఆరు నెలల్లోనే కోలుకునే విధంగా వైద్యం చేయిస్తామని హామీలిచ్చారు. రెండు మూడు నెలలు కోమాలో ఉన్న సాగర్ అనంతరం డిశ్ఛార్జి అయినా మంచానికే పరిమితమయ్యాడు. నడిసే, కనీసం లేచి కూర్చేలేని విధంగా సత్తువ కోల్పోయాడు. రెండు కాళ్లు పని చేయక, వెన్నెముక ఎముకలు పూర్తిగా దెబ్బతిని నిర్జీవుడిగా పడి ఉన్నాడు. సాగర్‌పై ఆధారపడి తల్లి వీరమ్మ, తండ్రి సామ్యేలు, భార్య కెజీయా, కుమారులు తేజు, హర్షాలు ఇప్పుడు ఏమీ పాలుపోలేని స్థితిలో దీనంగా బతుకీడుస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, సాగర్ పూర్తిగా కోలుకునేలా వైద్యంతోపాటు తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. సాగర్ దుస్థితికి కారణమైన అప్పటి అధికారులపైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.