మాట్లాడుతున్న సిఐటియు, అంగన్వాడీ యూనియన్ నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారం కోసం ముందస్తు అనుమతితో శాంతియుతంగా చలో విజయవాడకు సిద్ధమైన అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడడంపై పెట్టిన శ్రద్ధ హామీల అమలుపై పెట్టాలని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయలు నాయక్ కోరారు. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారితో కలిసి సోమవారం విలేకర్లతో మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు 3 నెలల ఇవ్వాలని, తదితర డిమాండ్లపై యూనియన్ చలో విజయవాడకు పిలుపునిచ్చిందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలను ఆకాశానికి ఎత్తిన ప్రభుత్వం అంగన్వాడీల చలో విజయవాడను అడ్డుకుని మహిళా దినోత్సవ స్ఫూర్తిని నీరుగార్చిందన్నారు. ప్రతినెలా చివరి వారంలో నిర్వహించే ప్రాజెక్టు సమావేశాలను ధర్నా నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా 10వ తేదీన ఏర్పాటు చేశారని, సమావేశానికి అంగన్వాడీలతో పాటు హెల్పెర్లు కూడా రావాలని హుకుం జారీ చేశారని చెప్పారు. అయినా కొందరు అంగన్వాడీలు విజయవాడ మహా ధర్నాకు వెళ్లడం పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 42 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమకు మద్దతిచ్చారని, తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 9 నెలలైనా అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు, హామీల సాధనకు, రాజకీయ వేధింపులపై దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉద్ఘాటించారు.ఇదిలా ఉండగా చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు వెళ్లకుండా అడ్డుకోవడానికి గుంటూరు నగరంలోనూ చాలాచోట్ల నాయకులకు పోలీసులు నోటీసులిచ్చినట్లు యూనియన్ నాయకులు దీప్తి మనోజ తెలిపారు. సెక్టార్ మీటింగ్ పెట్టాలని, మీటింగ్లో రకరకాల ట్రైనింగ్ ఇవ్వాలంటూ పీడీ ఆదేశించినట్లు అధికారుల నుండి చాలా ఒత్తిడి వచ్చిందని, బెదిరింపులు కూడా వచ్చాయని తెలిపారు. అయినా అంగన్వాడీలు అదరక బెదరక విజయవాడ చేరుకున్నారు. గుంటూరు జిల్లా నుండి 1200 సెంటర్లు మూసివేసి ధర్నాలో పాల్గొన్నారు.
