ప్రజాశక్తి-ఓబులవారిపల్లె ఎపిఎండిసి కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓబులవారిపల్లె మండలం, ముక్కా వారిపల్లెలోని కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి కార్యాలయంలో మంత్రి రైల్వేకోడూరు ఎమ్మెల్యే అవర శ్రీధర్‌తో కలిసి ఎపిఎండిసిలోని కార్మికులకు సంబంధించిన సమస్యలపై కార్మిక సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా ఎపిఎండిసి కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక సంఘాల సమస్యలపై ఎపిఎండిసి మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, గనుల శాఖ మంత్రితో సంప్రదించి జనవరి 25వ తేదీ లోపల సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక సంఘాలకు మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి హామీతో కార్మికులు తాత్కారికంగా సమ్మె విరమించారు. ఎపిఎండిసి కార్మికులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ కార్మికులకు పేస్కేల్స్ కేటాయించాలని, ప్రమోషన్లు కల్పించాలని, సిఎండి టెండర్‌ను ఆపాలని, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ 25వ తేదీ లోపల పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎపిఎండిసి కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.