పర్యావరణ పరిరక్షణపై క్విజ్‌ పోటీలు

పర్యావరణ పరిరక్షణపై క్విజ్‌

అపోలో టైర్స్‌్‌ ఆధ్వర్యంలో గీతంలో నిర్వహణ

సత్తా చాటి, ఫైనల్‌కు చేరిన డాక్టర్‌ విఎస్‌.కృష్ణ, సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీ విద్యార్థులు

ప్రజాశక్తి -మధురవాడ: ఆరోగ్యకర వాతావరణంలో రాబోయే తరాలు జీవించాలంటే పర్యావరణ పరిరక్షణలో యువత పాత్ర కీలకమని గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కెఎస్‌.కృష్ణ అన్నారు. గురువారం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వేదికగా అపోలో టైర్స్‌ సంస్థ నగరంలోని వివిధ కళాశాలల విద్యార్ధులకు పర్యావరణంపై క్విజ్‌ పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఆచార్య కృష్ణ మాట్లాడూతూ, తూర్పు తీరంలో మడ అడవుల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. పర్యావరణ పరిరక్షణను పరిశ్రమలు సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. యువతలో పర్యావరణపై అవగాహన పెంచేలా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గీతం స్కూల్‌ ఆఫ్‌ సైన్స్‌ జీవశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ అడువుల పెంపకం, నీటి వనరుల సంరక్షణ, పట్టణ వ్యర్ధాలను శుద్ధి చేయడం, ఎలక్ట్రానిక్‌ వ్యర్ధాల సేకరణ ప్రస్తుత కాలంలో ఆవశ్యక అంశాలన్నారు. పర్యావరణంపై విద్యార్ధులలో అవగాహనకు అపోలా సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.సురేష్‌ కుమార్‌ పోటీల వివరాలను వివరించారు. గురువారం నిర్వహించిన పోటీలలో నగరంలోని వివిధ విద్యాసంస్థల నుంచి 250 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. విఎస్‌.కృష్ణ ప్రభుత్వ కళాశాల, సెయింట్‌ జోసఫ్‌ కళాశాల విద్యార్ధులు ప్రతిభను చాటి ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరికి ఈ ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో చెన్నైలో జరిగే గ్రాండ్‌ ఫైనల్స్‌లో పాల్గొనే అర్హత లభించిందని అపోలో సంస్థ ప్రతినిధి బి.లీఫెన్‌ ప్రకటించారు.

పోటీలను ప్రారంభిస్తున్న ప్రొఫెసర్‌ కృష్ణ

➡️