కోరం లేక జెడ్‌పి భేటి వాయిదా

Apr 23,2024 23:45

మాట్లాడుతున్న జెడ్‌పి చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
వైసిపి, టిడిపి నాయకుల వ్యూహ ప్రతివ్యూహాల మధ్య జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం మంగళవారం కోరం లేక వాయిదా పడింది. గుంటూరులో చైర్‌ పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా తగినంత మంది సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశాన్ని ముగిస్తున్నట్టు చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా ప్రకటించారు. ఈ సమావేశంలో వైసిపి, టిడిపి వ్యూహాత్మకంగానే వ్యవహరించాయి. వైసిపి నుంచి జెడ్‌పి చైర్‌పర్సన్‌గా గెలిచిన హెనీ క్రిస్టీనా ఇటీవల కొల్లూరులో చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. హెనీ క్రిస్టినా టిడిపిలో చేరడంపై వైసిపి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆమెను పదవి నుంచి తప్పించేందుకు ప్రస్తుతం అనువైన సమయం కాదని పార్టీపెద్దలు చెప్పడంతో వైసిపి జిల్లా నాయకులు మౌనంగా ఉన్నారు.

సభ్యులు గైర్హాజరుతో ఖాళీగా ఉన్న కుర్చీలు

ఈ నేపథ్యంలో నిర్ణీత గడువు ప్రకారం 90 రోజుల్లోగా జిల్లా పరిషత్‌ సాధారణ సమావేశం నిర్వంచాల్సి ఉంది. ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో సమావేశం నిర్వహించాలా వద్దా అని తర్జన భర్జనలు జరిగాయి. ఈ మేరకు జిల్లా పరిషత్‌ అధికారులు కలెక్టర్‌ అనుమతి కోరారు. ఎన్నికల నిబంధనలను పొందుపరుస్తూ కలెక్టరు అనుమతిచ్చారు. ఈ మేరకు మంగళవారం సాధారణ సమావేశం జరుగుతుందని సభ్యులకు కొద్ది రోజుల ముందే సమాచారం పంపారు. వాస్తవంగా 54 మంది జెడ్‌పిటిసిలు ఉండగా ఇందులో 53 మంది వైసిపి నుంచి గెలుపొందారు. శావల్యాపురం జెడ్‌పిటిసి ఒక్కరే టిడిపి నుంచి గెలుపొందారు. గతనెల రోజులకాలంలో ఎన్నికల నేపథ్యంలో నలుగురు జెడ్‌పిటిసిలు టిడిపిలో చేరారు. అయినా వైసిపికి 90 శాతం మంది సభ్యులు ఉండటంతో పార్టీ మారిన హెనీ క్రిస్టినాను పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేయాలని తొలుత భావించారు. కానీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రయత్నం విరమించుకున్నారు.
మరోవైపు 90 రోజుల లోపు సమావేశం జరగకపోతే చైర్‌పర్సన్‌ పదవి నుంచి వైదొలగాలి. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో సమావే శాన్ని నిర్వహించి పదవిని నిలబెట్టుకోవాలని హెనీక్రిస్టినా వ్యూవరచన చేశారు. ఒకవేళ ఎన్నికల తరువాత టిడిపి అధికారంలోకి వస్తే తనకు తిరుగుండదని ఆమె భావించినట్టు తెలిసింది. దీంతో టిడిపి సీనియర్‌ నాయకుల సూచనల మేరకు మెజార్టీ లేకపోయినా ఆమె సమావేశం నిర్వహణకు మొగ్గుచూపారు. 54 మంది జెడ్‌పిటిసిలు, 17 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు, ఐదుగురు ఎంపిలు, ఇద్దరు కో-ఆప్టెడ్‌ కలిపి 86 మంది సభ్యులకు గాను కేవలం 11 మంది వచ్చారని, కోరం ఉండాలంటే 29 మంది హాజరు కావాల్సి ఉందని కోరం లేకపోవడం వల్ల సమావేశం నిర్వహించకుండానే ముగిస్తున్నట్టు చైర్‌పర్సన్‌ ప్రకటించారు. మొత్తం దాదాపు 43 మంది వైసిపి సభ్యులు సమావేశానికి రాలేదు. సమావేశానికి అధ్యక్షతన వహించిన జెడ్పీ చైర్‌ పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా మధ్యాహ్నం 3.15 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. కోరం లేకపోవడం వల్ల సభ్యుల కోసం వేచిచూస్తామని తొలుత గంటపాటు సమావేశానికి వాయిదావేశారు. తిరిగి సమావేశం 4.15 గంటలకు ప్రారంభమైంది. అప్పటికే జెడ్పి చైర్‌ పర్సన్‌తో కలిపి 11 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడంతో సమావేశం నిర్వహించడానికి తగినంత కోరం లేదని, సమావేశాన్ని ముగిస్తున్నామని ఆమె ప్రకటించారు. జిల్లాలో ముఖ్యమైన అధికారులు కూడా సమావేశానికి రాలేదు. జెడ్పీ డిప్యూటీ సిఈఓ మోహన్‌రావు, కొద్దిమంది జిల్లా అధికారులు, 11 మంది జెడ్‌పిటిసిలు, ఇద్దరు ఎంపిపిలు హాజరయ్యారు.

➡️