ఉరుములు, మెరుపులతో వర్షం

Apr 15,2025 21:08

పలుచోట్ల వర్షాలతో సేద తీరిన జనం

నువ్వు రైతుల హర్షం

ప్రజాశక్తి-రేగిడి, వంగర, బొబ్బిలి : జిల్లాలో పలు చోట్ల మంగళవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మూడు రోజులు పాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపిన నేపథ్యంలో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై రేగిడి మండలంలోని సంకిలి, ఉంగరాడ మెట్ట, బూరాడ తదితర గ్రామాల్లో గాలి, ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో వద్ధులు, చిన్నారులు, ప్రజలు అల్లాడు పోయారు. భారీ వర్షం పడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అలాగే ఈ వర్షంతో మొక్కజొన్న, నువ్వు పంట ఇతర అపరాలు పంటల రైతులు కొంతమేర ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వంగర మండలంలోని శివ్వాం, ఎం.సీతారాంపురం, తలగాం, వంగర, రుషింగి తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఎండలు మెండుగా ఉండటం వల్ల ఉక్కపో తతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించినప్పటికీ పలు గ్రామాలలో మరుగు నీటి కాలువలు సక్రమంగా లేనందున రోడ్ల పైన, లోతట్టు ప్రాంతాల ఇళ్లలో నీరు చేరింది. మండలంలో వివిధ గ్రామాలలో మొక్కజొన్న పంట కోత దశలో ఉండటం వల్ల రైతులంతా ముమ్మరంగా మొక్కజొన్న పంటను నూర్పుడి చేసి కల్లాల్లోనూ, పొలాల్లోనూ టార్పానులపై ఎండ బెట్టారు.  మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురవడంతో కొంతమందికి చెందిన మొక్కజొన్న పంట తడిసి పోయిందని రైతులు ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా కల్లాలలో నీరు చేరడంతో ఆ నీటిని బయటకు తోడేందుకు రైతులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు.

బొబ్బిలిలో చిరుజల్లులతో వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేద తీరారు. వర్షం కూరగాయలు, చెరకు, నువ్వుల పంటకు అనుకూలంగా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విజయనగరంలో వర్షం కురవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3గంటల నుంచి వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేతతీరారు.

➡️