ప్రజాశక్తి – కడప ప్రతినిధి/చాపాడు రాజోలి జలాశయాన్ని పూర్తి చేసి 90 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని మైదుకూరు పట్టణంలోని కెఎస్‌సి ఫంక్షన్ హాలులో ఎన్‌టిఆర్ 29వ వర్థంతి సభ, జడ్‌పి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజానీకం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నినాదానికి పరిమితం చేయకుండా ఉద్యమరీతిలో ఉద్యమ రీతిలో ముందుకు సాగాలన్నారు. మెదడు, శరీరం, పని ప్రదేశాలు, ఇళ్లు, ఇంటి పరసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యా సంస్థల్లో ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పరిమితం చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో ఏడు కి.మీ సిసిరోడ్లు, మైదుకూరును మోడల్‌గా ఎంపిక, మురుగునీటిని శుద్ధి చేసి పంటలకు మళ్లించాలి. మైదుకూరును మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. మైదుకూరులోని ప్రతింటికీ ట్యాప్ ఇవ్వాలి. ప్రతి ఇంటింటికీ గ్యాస్‌పైప్‌లైన్ వ్యవస్థ అమలు చేయాలన్నారు. రూ.90 కోట్లతో అమృత్ పథకం పనులు చేపడతామని చెప్పారు. రాయలసీ మలోని అనంతపురం జిల్లా ఎడారిగా మారబోతందనే హెచ్చరికల నేపథ్యంలో వందల కోట్ల రూపాయలతో హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను చేపట్టి, రాబోయే పెనుప్రమాదాన్ని నివారించామన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి-సంక్షేమం-సుపరి పాలన ఎజెండాతో సాగించిన ప్రచారాన్ని నమ్మి జిల్లా ప్రజానీకం ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిదింటిని కూటమి పార్టీలకు కట్టబెట్టారన్నారు. కడప పార్లమెంట్ స్థానాన్ని సైతం స్వల్ప మెజార్టీతో కోల్పోయామని, మరింత శ్రమించి ఉంటే దక్కిం చుకునే అవకాశం ఉండేదన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలోని ఎంఎస్‌ఎంఇ తరలించ బోమని, ఎపిజిబి ప్రధాన కార్యాల యాన్ని సైతం కేంద్రంతో సంప్ర దించిన అనంతరం సానుకూల నిర్ణయం తీసుకు ంటామని తెలిపారు. కేంద్రం కొప్పర్తి పారిశ్రామికవాడకు రూ.2,300 కోట్లు ఇచ్చిందని, దీంతో సమీపంలో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వస్తే జిల్లా ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. గండికోట పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పరచడం ద్వారా టూరిస్ట్ హబ్‌గామారి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆదర్శనీ యుడని కొనియాడారు. రూ.2 కిలోబియ్యం, జనతా వస్త్రాలు, పక్కాఇళ్లు, మహిళలకు ఆస్తిహక్కు, బిసిలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అవకాశాలను కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. మైదుకూరుకు బిసి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నాడని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన దాఖలాల్లేవన్నారు. ఎన్టీఆర్ రాకతో దోపిడీ రాజకీయాలకు తెర పడిందని చెప్పారు. రాజకీయాల్లోకి విద్యావంతులను తెచ్చిన ఘనత వహించారని తెలిపారు. పేదరికం లేని సమాజం టిడిపితోనే సాధ్యమన్నారు. రాయలసీమ జిల్లాల ఆదాయాలను అంచనా వేస్తే భవిష్యత్‌లో కడప, అనంతపురం అధిక ఆదాయ జిల్లాలుగా నిలవనున్నట్లు తేలిందన్నారు. కరువు పీడిత జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్తలు తయారు కావాలన్నారు. ప్రతిఒక్కరూ కీ.శే ఎన్‌టిఆర్ ఆదర్శాలకు పునరంకితం కావాలన్నారు. ప్రొద్దు టూరులో నందం సుబ్బయ్య హత్య నేపథ్యంలో ఆయన చూపిన తెగువను స్మరణకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని చెప్పారు. అనంతరం టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రమంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సిఎంను చేయాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ మైదుకూరులో 100 పడకల ఆస్పత్రికి స్థలం కొరత కారణంగా భవన నిర్మాణ పనులకు టెండర్లు పిలవడం లేదని, స్థలాన్ని కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.రూ.50 కోట్లతో రోడ్లు, రూ.50 కోట్లతో డ్రెయినేజీ పనులకు కేటాయించాలని కోరారు. ఉర్ధూ కళాశాల, మార్కెటింగ్ కోల్డ్ స్టోరేజీ, పాలిటెక్నికల్ కళాశాలల భవన నిర్మాణ సదుపాయాలను మంజూరు చేయాలన్నారు. టిజిపి నుంచి తాగునీటి పథకం, రైతు బజార్, డిగ్రీ కళాశాల భవనం, చేనేతలకు వృత్తి పనులు కల్పించాలని, మినీస్టేడియం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సిఎం చంద్రబాబు నాయుడు స్పందించి రాబోలి జలాశయాన్ని పూర్తి చేస్తామని హామీనిచ్చిరు. అనంతరం కడపకు చెందిన అలైక్య చెత్త వ్యర్థాల నుంచి పంటలు పండించిన అలైక్య, మున్సిపల్ కార్మికులు అములమ్మ, గంగాధర్, అనకాపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీనాధ్‌ల్ని రూ.లక్ష నగదుతోపాటు సన్మానం చేశారు. మైదుకూరు పట్టణం వినాయకనగర్‌కు చెందిన వందన అనే గృహిణిని సన్మానించారు. అనంతరం జర్నలిస్టు పోరం నాయకులు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం జర్నలిస్టు పోరం సభ్యులు జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్లస్థలాలు, అక్రిడిటేషన్లు, కరోనా మృతులకు పరిహారం, ప్రమాదబీమా, రిటైర్డు జర్నలిస్టులకు పింఛన్ సదు పాయం వంటి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, సి.ఆది నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, విజయమ్మ, టిడిపి నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి, ప్రవీణ్, రితీష్, జగన్, పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
