వైసీపీ పాలనలో అడ్డగోలుగా విద్యుత్‌ చార్జీలు పెంచి, ర్యాలీలు నిరసనల పేరుతో రాష్ట్రంలో నేడు డ్రామాలా..!!

Dec 27,2024 18:31 #antapuram

ప్రజాశక్తి – అనంతపురం :  గత వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విద్యత్‌ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి, ఇప్పుడు తగ్గించాలని ర్యాలీ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం “విద్యుత్ చార్జీలు పెంచారంటూ” వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలను ఖండిస్తూ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ …. ఈ రోజు వైసీపీ పార్టీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాయదుర్గంలో ర్యాలీ ప్రదర్శన చేసి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద బురద చల్లటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు వారి హయంలో 9 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 32,000 కోట్ల రూపాయల విద్యుత్‌ భారం వేశారన్నారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విధ్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి ఇప్పుడు తగ్గించాలని ర్యాలీ, నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారన్నారని, అవినీతి, అక్రమాల కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ర్యాలీలు నిరసనలు కార్యక్రమాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, సౌరవిద్యుత్‌ ఒప్పందాల్లో ముడుపులు కేసుల్లో అమెరికాలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అధినేత జగన్‌ రెడ్డి పోరుబాట పేరిట ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు.

➡️