– పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్
ప్రజాశక్తి -ఎటపాక
గ్రామ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏపీ గ్రామ/వార్డు వాలంటీర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యాన వాలంటీర్లు ఎటపాకలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపిడిఒకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు పి కొండబాబు, బి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చామని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేశామని, కానీ కనీస వేతనం, పని గంటలు, పని విధానం లేకుండా వెట్టి చాకిరీ చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో టిడిపి కూటమి నాయకులు వాలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలు కనీస వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడిచినా హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. తక్షణమే ఎన్నికల హామీలు అమలు చేయాలని, రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల నాటి నుండి నేటి వరకు నాలుగు నెలల పెండింగ్ వేతనం రూ.10వేలు చొప్పున రూ.40వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు జి హరనాధ్, కార్యదర్శి డేగల మాధవరావు, నాయకులు తోట శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు.