ప్రజాశక్తి – నగరం : అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బహుజన ప్రజాసంఘాల నేతలు కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల నాయకులు తహశీల్దారు కార్యాలయం వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎస్‌సి,ఎస్‌ఠఙ అట్రాసిటీ చట్టం ప్రకారంగా బాధిత కుటుంబానికి రూ.8 లక్షల నగదు, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చి గృహం నిర్మించాలన్నారు. ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన మహాసభ సెంట్రల్ కమిటీ కార్యదర్శి జిఆర్. భగత్ సింగ్, గిరిజన ఐక్యవేదిక కన్వీనర్ ఊసరపు వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ నరసింహారావు, ఎరుకుల హక్కుల పోరాట సమితి జాతీయ కార్యదర్శి నల్లమౌతం ధర్మేంద్ర, ఆదివాసి ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్, ఆర్‌ఐపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి విప్పర్ల ముత్తయ్య, గిరిజన నాయకుడు దేవరకొండ రాము, ఆదివాసి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇట్టా ధనకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
