రామోజీరావు రాజకీయ భిక్ష పెట్టారు: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ తనకు రాజకీయ భిక్ష పెట్టింది రామోజీ గ్రూపుల చైర్మన్‌, ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావేనని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. శనివారం రామోజీరావు మరణవార్త విని తన కళ్లు చెమ్మగిల్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ రామోజీరావు మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. ఆయన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కొనియాడారు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి ఆదర్శప్రాయుడిగా చరిత్ర పుటలలో నిలిచారని అన్నారు. 2004 ఎన్నికల ముందు కంభంపాటి కంభంపాటి రామ్మోహన్‌రావు ద్వారా రామోజీరావును కలిశానని, రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నామనేది ముఖ్యం కాదని, ప్రజలకు ఎంత సేవ చేసి దగ్గరయ్యామా అన్నదే ముఖ్యమని చెప్పి ఎంతో విలువైన సలహాలను ఇచ్చారని అన్నారు. అంతేకాక తన ఉత్సాహాన్ని చూసి రాజకీయాల్లో తప్పక రాణిస్తావని ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దర్శి: ఈనాడు సంస్థల చైర్మన్‌ రామోజీరావు సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి అసాధారణ వ్యక్తిగా ఎదిగి తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. శనివారం రామోజీరావు చిత్రపటానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కలమే ఆయుధంగా సమాజంలో చైతన్యం నింపేందుకు రామోజీరావు అహర్నిశలు శ్రమించారని, జర్నలిజంలో కొత్త ఒరవడిని సృష్టించారని అన్నారు. రామోజీ రావులేని లోటు తీరనిదన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, బిజెపి నాయకులు శ్రీను, నగర పంచాయతీ చైర్మన్‌ నారపశెట్టి పిచ్చయ్య, తెలుగుదేశం నాయకులు మారెళ్ల వెంకటేశ్వర్లు, జూపల్లి కోటేశ్వరరావు, దారం సుబ్బారావు, వైస్‌ చైర్మన్‌ గన్నెపూడి స్టీవెన్‌, శోభారాణితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం: ఈనాడు తెలుగు దిన పత్రిక అధినేత రామోజీరావు మృతి చెందడం బాధాకరమని పలువురు టిడిపి నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పత్రికా పరంగా అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు షేక్‌ మౌలాలి, ఎమ్మెల్యే కందుల సోదరుడు కందుల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి కొండపి మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు పూలమాల వేసి నివార్పించారు. రామోజీ అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. అక్షర యోధుడు చెఱుకూరి రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజల జీవితాలలో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారని తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం పని చేశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆయనే తనకు స్ఫూర్తి అని రామారావు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️