ప్రజాశక్తి – రాచర్ల : రాచర్ల మండలం జె.పుల్లలచెరువు గ్రామ సమీపంలోని నల్లమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో సోమవారం గోవిందనామ స్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మార్మోగిపోయింది. నామస్మరణతో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది కార్లు, ఆటోలు, ట్రాక్టర్లలో తరలి వచ్చి స్వామి వారి తెప్పోత్సవాన్ని తిలకించారు. రంగనాయకస్వామి ఆలయ ప్రాంగణంలో నెమలి గుండం కొండిపాంతం మొత్తం జనసంచారంతో కిక్కిరిసిపోయింది. వేలాదిమంది గోవిందా నామస్మరణ చేస్తుండగా పండితులు వేదమంత్రాలు ఉచ్చరించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి స్వామి వారిని నెమలిగుండం పుష్కరిణి వద్దకు మోసుకొచ్చారు. చెన్నై వారిచే ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పపై స్వామిని వారి ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. లక్షల మందికి పైగా భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించి ఆనందం పొందారు. అనంతరం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఆర్యవైశ్య, కాశీనాయన, వేమా రెడ్ల, శ్రీగోపాలకష్ణ యాదవ, శ్రీకష్ణదేవరాయ బలిజ, విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రాల్లో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, ఆలయ ఇఒ మల్లవరపునాగయ్య , ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
