ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన రసూల్‌ బేగ్‌

ప్రజాశక్తి-కంభం రూరల్‌ : ఏ గురువు పేరు పలికితే ఆ గురువు పనిచేసిన పాఠశాల కళ్లముందు కనిపిస్తుందో, ఏ పాఠశాల పేరు పలికితే ఆ గురువు మాత్రమే గుర్తుకొస్తారో వారే ఉత్తమ ఉపాధ్యాయులని, ఆ వరుసలో మొట్టమొదట కనిపించే అత్యుత్తమ గురువు మొఘల్‌ రసూల్‌ బేగ్‌ అని ఎంఈవోలు మాల్యాద్రి, శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక పార్కు వీధి పాఠశాలలో ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభను భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు. గత 37 సంవత్సరాలుగా ఓనమాలను ఊయలూపుతూ, జ్ఞాన శిఖరాలను పేర్చి కూర్చి, ఓర్పుకు ఉపమానమై తీర్పుకు ఉపమేయమై అందరి హృదయాలలో అచ్చు వేయబడిన ఆది గురువుగా ఆయన నిలిచివుంటారని వక్తలు కొనియాడారు. సొంత నిధులతో వినూత్న బోధనోపకరణాలను రూపొందించి విద్యా విలువలకు అలంకారాలద్దిన త్యాగనిరతి ఆయన సొంతమని అన్నారు. నీతి, నిజాయితీ, నిరాడంబరత, ఓర్పు నేర్పుల నిలువెత్తు రూపమే ప్రధానోపాధ్యాయులు రసూల్‌ బేగ్‌ అని, గురువుగా వారి ఘనతను ప్రశంసించేందుకు పదాలు సరిపోవని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మొఘల్‌ రసూల్‌ బేగ్‌ మాట్లాడుతూ ఉద్యోగ ప్రయాణంలో అనుక్షణం వెన్నంటి, తన ఉనికికి ఊతగా నిలిచిన అర్ధాంగి సేవలను, సమయస్ఫూర్తిని వివరిస్తూ, తన విజయం వెనుక రహస్యాన్ని వెల్లడించారు. ఈరోజుతో బడికి దూరమవాలన్న బాధను వ్యక్తం చేస్తూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం బంధువులు, ఎంఈవోలు, మాజీ ఎంఈవోలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ఉన్నతాధికా రులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి బహుమతులను అందించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ హై, స్టేట్‌ కౌన్సిలర్‌ ఒవీ వీరారెడ్డి, యుటిఎఫ్‌ నాయకులు వి వెంకటేశ్వర్లు, ఖాసిం, కేశవ, రాధాకృష్ణ, సునీల్‌, వేణు, తిరుపతయ్య, సుబ్రహ్మణ్యం, రాజేష్‌, పాండురంగారావు, చంద్రశేఖర్‌రెడ్డి, జలీల్‌, రఫీతో పాటు పలువురు యుటిఎఫ్‌ నాయకులు, ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️