సాగునీటి కోసం రాస్తారోకో

Mar 20,2025 00:43

ఎండిపోతున్న వరిపైరుతో దొడ్లేరులో రాస్తారోకో చేస్తున్న రైతులు, నాయకులు
ప్రజాశక్తి – క్రోసూరు :
చింతపల్లి సాగర్‌ కెనాల్‌ కింద ఎండిపోతున్న పైర్లకు నీరందింకి కాపాడాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని దొడ్లేరు గ్రామంలో రైతులు బుధవారం రైతు, కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. కౌలురైతు సంఘం పల్నాడు జిల్లా నాయకులు టి.హనుమంతరావు మాట్లాడుతూ మార్చి మొదటి నుండి చింతపల్లి సాగర్‌ కెనాల్‌ కిందకు నీరందక వరి పైర్లు ఎండిపోతున్నాయని, అధికార్లకు పలుమార్లు విన్నవించినా నీటి సామర్థ్యం పెంచలేదని, దీంతో నీరు కాల్వ సమీపంలోని పొలాలకే నీరందుతోందని చెప్పారు. సమస్యపై సాగర్‌ కెనాల్‌ అధికారులకు రైతులు ఫోన్లు చేసినా స్పందింకపోవడంతో ఆందోళనకు పూనుకున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారని, ఒక్కొక్కరు 5-10 ఎకరాలు సాగు చేశారని, పొట్ట దశలో ఉన్న పైరుకు నీరందకుంటే ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోతారని తెలిపారు. మధ్యాహ్నం మొదలైన ఆందోళన మూడు గంటల పాటు కొనసాగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులు ఆవుల ఆంజనేయులు, రావెల్ల వెంకటేశ్వర్లు, తిమ్మిశెట్టి హనుమంతురావును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంటన్నర తర్వాత సొంత పూచీకత్తుపై విడదల చేశారు. స్టేషన్‌లో నాయకులను సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు పరామర్శించారు. నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోలీస్‌స్టేషన్‌లో కూడా బైఠాయించి నిరసన కొనసాగిస్తామని చెప్పడంతో గురువారం సాయంత్రానికి నీరు విడుదల చేస్తామని ఎన్‌ఎస్‌పి ఎఇ బట్టి శ్రీనివాసరావు హామీనిచ్చారు.

➡️