ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల జిల్లా) : గిట్టుబాటు ధర కల్పించి నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బాపట్ల జిల్లా వ్యాప్తంగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. పర్చూరులోని బొమ్మల సెంటర్లో రైతు సంఘం, కౌలురైతు సంఘం నాయకులతో కలిసి ఎర్ర జెండాలను ఊపుతూ కొద్దిసేపు వాహనాలను ఆపి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ గోడుని పట్టించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ గతేడాది ధరలకే బర్లీ పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. న్యాయం చేయాలన్నారు. దళారులు మద్దతు ధరను పదేపదే మార్చకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. విదేశీ సిగరెట్లలో ఎక్కువగా ఉపయోగించే బర్లీ పొగాకును టాబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పొగాకు రైతులు చేతివృత్తుల సంఘం జిల్లా నాయకులు పి కొండయ్య, పొగుకు రైతులు పాల్గొన్నారు.
జిల్లాలోని ఇంకొల్లు మండలంలోని కొనికి కట్టావారిపాలెం సెంటర్ వద్ద నల్లబర్లీ పొగాకు రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి నాయకులు తలపనేని రామారావు, రైతుసంఘం ప్రకాశం జిల్లా నాయకులు పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడం లేదన్నారు. రైతుల సమస్యలు వారికి పట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
ఇంకొల్లు మండలం పూసపాడు అడ్డరోడ్డు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కందిమళ్ల రామకోటేశ్వరావు మాట్లాడారు. రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభించకపోతే పోరాటాలు విస్తరిస్తాయని హెచ్చరించారు.