ప్రజాశక్తి – సామర్లకోట : సామర్లకోటలో రేషన్ సరుకులు అందక పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యం డి యు ఆపరేటర్ల పై వచ్చిన పలు ఆరోపణల కారణంగా పలు ప్రాంతాల్లో రేషన్ వాహనాలు సేవలు నిలిపి వేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే పలు ప్రాంతాల్లో రేషన్ వాహనాలు రాకపోవడంతో ప్రజలకు రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక బలుసుల పేటలో వాహనం కోసం ప్రజలు గత కొద్దిరోజులు ఎదురుచూస్తున్నా వాహనాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం రేషన్ కార్డులతో రేషన్ వాహనం వచ్చే పాయింట్ వద్ద ప్రజలు సరుకుల కోసం వేచి ఉన్నారు. అయితే వాహనాలు రాకపోవడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు విలేకరుల వద్ద వారు వెల్లడించారు. చంటి పిల్లలు, పెద్దలతో ఉన్నతాము రేషన్ షాపుకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఎదురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుషులు పనికి వెళితే తప్ప కుటుంబం గడవని పరిస్థితుల్లో వృద్ధులు చంటి బిడ్డలతో ఉన్న తాము రేషన్ షాపుకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండడంతో పాటు సరుకులను మోసుకొని తీసుకురావడం ఇబ్బందికరంగా ఉందన్నారు. తమ ప్రాంతాల్లో అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఒక బలుసుల పేటలో మాత్రమే కాకుండా మూడో వార్డు కందకం ప్రాంతంలోనూ రేషన్ సరుకులు అందడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు రేషన్ వాహనాలను పంపించి ఇంటింటికి సరుకులు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎం ఎస్ ఓ వివరణ:
ఈ విషయమై ఎమ్మెస్ ఓ కమల కుమారినీ ప్రజాశక్తి విలేకరి వివరణ కోరగా బలుసుల పేట, బ్రౌన్ పేట డిఎంయు వాహనాల ఆపరేటర్ల పై క్రమశిక్షణ చర్యలకు చెందిన కేసులు జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని అవి క్లియర్ అవ్వగానే సమస్య పరిష్కారం అవుతుందని, అప్పటివరకు కార్డుదారులు రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
