రాయలసీమ సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి

Mar 20,2025 16:09 #Congress party, #Kadapa

ప్రజాశక్తి – కడప : రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు. మిషన్ రాయలసీమను అమలు చేయాలని కోరారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో విజయ జ్యోతి మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాగునీరు, సాగునీరు, విద్య, ఆరోగ్య రంగాలు, ఉపాధి, వ్యవసాయం, పండ్ల తోటల సాగు వంటి కీలక రంగాలకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని చేశారు.రాయలసీమను విత్తన రాజధానిగా ప్రకటించి, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా, కియా, ఇసుజు వంటి ప్రధాన కంపెనీలను ఆకర్షించి రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలని సూచించారు.రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను రాయలసీమ ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని  పేర్కొన్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ‘మిషన్ రాయలసీమ’ను అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

➡️