లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: ఆర్‌డిఒ

ప్రజాశక్తి-రేపల్లె: గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధ) చట్టాన్ని ఉల్లంఘించి లింగ నిర్ధారణ చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ డివిజన్‌ అధికారి బిఎస్‌ హేలా షారోన్‌ హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టంపై మంగళవారం డివిజన్‌ స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం అనే నినాదంతో అవగాహన కల్పించాలన్నారు. గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, ఏమైనా అంగవైకల్యంతో ఉందా అని మాత్రమే స్కానింగ్‌ ద్వారా చెక్‌ చేయాలని సూచించారు. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ మెషీన్లు, రిజిస్ట్రేషన్‌ గడువు తేదీకి నెల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం జిల్లా కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తయిన యజమాన్యాలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డయాగ్నోస్టిక్‌, ఇమేజింగ్‌, ఫెర్టిలిటీ సెంటర్లు, స్కానింగ్‌ మెషీన్ల ద్వారా లింగ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి స్కానింగ్‌ చేయబోమని ఆసుపత్రిలో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆర్డీవో ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. క్లినిక్కు, హస్పిటల్స్‌ స్కానింగ్‌ యంత్రాలను కొనుగోలు చేసే ముందుగానే జిల్లా అప్రాప్రియేట్‌ అథారిటీ దగ్గర ఎన్సీసీ తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో స్కానింగ్‌ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. అర్హులైన వైద్యుని సలహా మేరకు మాత్రమే గర్భవతులు స్కానింగ్‌ తీయించుకోవాలని తెలియజేశారు. లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రోహిణి రత్నశ్రీ, శర్మ, సీఐ నజీర్‌ బేగ్‌, డాక్టర్‌ వీర రాఘవయ్య, ప్రభాకర్‌, సక్సేనా, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ చైతన్య తేజ, డాక్టర్‌ రమేష్‌, డాక్టర్‌ జాన్‌ ప్రసాద్‌ రెబ్బా, మరియమ్మ అరుణ పాల్గొన్నారు.

➡️