కాంట్రాక్టు కార్మికుల పనిదినాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి

Steel contract workers Dharna

ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికుల పనిదినాల తగ్గింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు ఉక్కు యాజమాన్యాన్ని హెచ్చరించారు. యూనియన్‌ ఆధ్వర్యాన సిఆర్‌ఎంపి, ఆర్‌ఎంహెచ్‌పి, ఎస్‌పి, డబ్ల్యూఆర్‌ఎం, ఎస్‌బిఎం తదితర విభాగాల హెచ్‌ఒడి ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉక్కు యాజమాన్యం ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టకుండా, కాంట్రాక్టు కార్మికులను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు బయోమెట్రిక్‌లో లోపాలను సరిచేయకుండా కార్మికుల జీతాల్లో కోత విధిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదేశాలకు తలొగ్గి కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. యాజమాన్యం వైఖరిలో మార్పు రాకపోతే ఈ నెల 30న ఇడి వర్క్స్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. అన్ని విభాగాల అధిపతులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కెఎం.శ్రీనివాస్‌, ఒవి.రావు, నమ్మి రమణ, కెపి.సుబ్రమణ్యం, సూర్యకుమార్‌, చట్టి నర్సింగరావు, ఎన్‌.కృష్ణ, పి.మసేను, కె.సత్యవతి, ఎన్‌.సోమునాయుడు, జి.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️