ట్యూషన్‌ కేంద్రాల నిర్వాహకుల ప్రాంతీయ శిక్షణా శిబిరం

కంచరపాలెం (విశాఖ) : నేడు, రేపు రెండు రోజులు ప్రాంతీయ శిక్షణా శిబిరం కంచరపాలెం లో బి. ఎన్‌. ఆర్‌ ఫౌండేషన్‌ లో శనివారం ఉదయం నుండి ప్రారంభమయ్యింది. చదువు అనేది ఒక విద్యార్థిలో అంతర్గతంగా ఉన్న అనేక నైపుణ్యాలను, సృజనాత్మకతను వెలికితీసేది. అందుకు తరగతి గది ఆయువు. ఉల్లాసంగా, ఉత్సాహంగా బోధన చేసే ప్రక్రియ ద్వారా ఈ సమాజానికి అత్యున్నతమైన వ్యక్తులను, ఉన్నతమైన పౌరలను అందించగలం. కానీ నేడు విద్యార్ధులు నాణ్యమైన చదువు లేక నాసిరకమైన విద్యతో ఎందులోనూ నైపుణ్యం చూపలేని స్థితిలో వున్నారు. అందుకోసమే తలిదండ్రులు స్కూలు అనంతరం ట్యూషన్లకు పంపిస్తున్నారు. అవి కూడా అత్యధిక ఫీజుల తోనూ లేకపోతే కేవలం హోంవర్క్‌ చేసే కేంద్రాలుగా వున్నాయి. పాఠశాల సిలబస్‌తోపాటు ప్రత్యేకంగా శాస్త్రీయ కోణంలో సిలబస్‌ ను చెప్పడం, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాలను జోడించి విద్యార్థులను విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్దడం కోసం వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ 2019 నుంచి ట్యూషన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నది. ఇప్పుడు రాష్ట్ర వ్యాపితంగా ఆంధ్రప్రదేశ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్స్‌ ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ కేంద్రాలకు ఆసరా ఛారిటబుల్‌ సొసైటీ విశ్వ మానవ సంక్షేమ సంఘం సహకారం అందిస్తున్నాయి. మొదటి రోజు సెంటర్ల నిర్వహణలో అనుభవాలు, ట్యూషన్‌ టీచర్స్‌/ నిర్వాహకుల ప్రాధాన్యత, ఆవశ్యకత, చదువు ఎందుకు ? చదువులో కధలు, పద్యాలు ప్రాధాన్యత ? చదువులో ఆటలు, పాటలు, డ్యాన్సులు ప్రాధాన్యత ఏమిటి ? అనే అంశాలు ఆక్టివిటీస్‌ ద్వారా నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహణ సతీష్‌ చేయగా వివిధ అంశాలపై ఎల్లాజి, పార్ధ సారధి, నీలవేణి, గణేష్‌, కృష్ణవేణి, డి. శైలజ, రష్మిక ఇంటరాక్టివ్‌ సెషన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమములో విశాఖపట్టణం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కఅష్ణాహొ జిల్లాలవారు పాల్గొన్నారు.

➡️