మధ్యాహ్న భోజన కార్మికుల రిలే నిరాహార దీక్షలు

ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌) : తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని నందిగామ ఆర్డీవో కార్యాలయం వద్ద కార్మికులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి కే గోపాల్‌ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పధకం కార్మికులు గత 23 సంవత్సరాలుగా ప్రైమరీ,అప్పర్‌ ప్రైమరీ,హైస్కూల్స్లో విద్యార్ధిని, విద్యార్థులకు ప్రభుత్వ మెనూ ప్రకారం ఆహారాన్ని వండిపెడుతున్నారు.వీరంతా బడుగు,బలహీన వర్గాలకు చెందిన మహిళలే.కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోయినా,ప్రభుత్వం నుండి బిల్లులు సకాలంలో రాకపోయినా అప్పులు తెచ్చి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ వంట చేసి పెడుతున్నారు.అనేక సంవత్సరాలుగా దీనినే నమ్ముకుని జీవిస్తున్నారు.అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులను, శానిటేషన్‌ పర్కర్లను,వాచ్మెన్లను పని నుండి బలవంతంగా తొలగిస్తున్నారు.వారు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ,వారిపై ఎలాంటి రిమార్కులు లేకపోయినప్పటికీ అనేక సంవత్సరాలుగా ఇబ్బందులకోర్చి పని చేస్తున్న కార్మికులను రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారు. ఇప్పటికే నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నందిగామ మండలం లింగాలపాడు జిల్లా పరిషత్‌,ఎంపీపీ స్కూల్లో 23 సంవత్సరాలుగా పనిచేస్తున్న నలుగురు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు,ముగ్గురు శానిటేషన్‌ వర్కర్లను,అప్పర్‌ ప్రైమరీ స్కూల్లో ఇద్దరిని, చందర్లపాడు మండలం ముప్పాళ్ళ యం.పి.యుపి స్కూల్లో ఇద్దరిని, పెనుగంచిప్రోలు మండలం సుబ్బాయగూడెం యం.పి.యుపి స్కూల్లో ఇద్దరిని,అనిగండ్లపాడు జిల్లా పరిషత్‌ స్కూల్లో నలుగురిని, వీరులపాడు మండలం జుజ్జూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ముగ్గురు మధ్యాహ్న పధక పధకం కార్మికులు,ఒక వాచ్మెన్ను అక్రమంగా తొలగించారు.ఇంకా అనేక చోట్ల తొలగిస్తామని బెదిరిస్తున్నారు.ఇది సరైనది కాదు.ఈ కార్మికులందరూ పేద,దళిత వర్గాలకు చెందినవారే. అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వీరిని తొలగించడం సమంజసం కాదు.అక్కడక్కడా అధికారులు కూడా రాజకీయ నాయకుల ఒత్తిడులకు లంగి కార్మికులను తొలగించడం అన్యాయం.కావున ప్రస్తుతం పనిచేస్తున్న వారెవరినీ రాజకీయ కారణాలతో తొలగించకుండా యధాతథంగా కొనసాగించేలా తమరు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాము.ఇదే పద్ధతి కొనసాగితే కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు కూడా సిద్ధమవుతామని ప్రభుత్వనికి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు గోపి నాయక్‌, మధ్యాహ్నం భోజన కార్మికులు వేల్పుల ఏసోబు, కళావతి, సత్యవతి, పుల్లయ్మ,శ్యామ్‌, ప్రసాద్‌, కార్మికులు పాల్గొన్నారు.

➡️