ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి పట్టణం మతసామరస్యానికి ప్రతీక అని, పట్టణంలోని హిందూ ముస్లిములు ఎప్పటికీ సోదర భావంతో మెలగాలని రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టర్ ఛాంబర్‌లో మంత్రి, కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్‌పి విద్యాసాగర్‌నాయుడు, జెసి ఆదర్శ్ రాజేంద్రన్‌లతో కలిసి హిందూ ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలోని గాంధీ బజార్‌లో ఈ నెల 4న సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాల వల్ల జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ఆపోహలు తలెత్తయన్నారు. అన్న దమ్ముల్లా కలిస ిమెలిసి జీవించే ప్రజల మధ్య కొన్ని వర్గాల వల్ల చిన్న గొడవ జరిగిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి పట్టణంలో పోలీస్ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి వారం రోజులలో ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. మరుసటి రోజు నుంచే ప్రజలు తమ తమ పనుల్లో నిమగమయ్యారని చెప్పారు. పస్తుతం రాయచోటి పట్టణంలో ఎటువంటి సమస్యలు లేవని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని పేర్కొన్నారు. 40 సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణం ఎదిగే కొద్ది తాము, తమ కుటుంబ సభ్యులం రాయచోటి ప్రాంత ప్రజల సంక్షేమం కోసం, ఈ ప్రాంతం అభివద్ధి కోసం పనిచేశామని చెప్పారు. మండిపల్లి కుటుంబం ఉన్నంతవరకు రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య ఉన్న ప్రేమ అభిమానం ఎల్లవేళలా అలాగే ఉంటూ ప్రజలందరూ కలిసిమెలిసి జీవిస్తారన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని, ఎటువంటి సంబంధం లేని అమాయకులపై కేసులు పెట్టకూడదని పోలీసు వారికి సూచించామని చెప్పారు. ఎవరో కొంతమంది కావాలని సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారాల వల్ల పట్టణంలో జరిగిన చిన్నసమస్య రాష్ట్రవ్యాప్తంగా పాకిపోయిందన్నారు. ప్రస్తుతం రాయచోటి పట్టణంలో ఉన్న 144 సెక్షన్‌ను ఎత్తివేశామన్నారు. రాబోయే రోజులలో ఇలాంటి సమస్య పునరావతం కాకుండా ఉండేందుకు రంజాన్ తర్వాత మరొక పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హిందూ ముస్లిములు ఎల్లవేళలా కలిసిమెలిసి జీవించేందుకు తమ వంతు కషి చేస్తామన్నారు.
