మత సామరస్యాన్ని కాపాడుకోవాలి

Jan 7,2025 21:23

 దేశ సమైక్యత, రాజ్యాంగ పరిరక్షణకు సిపిఎం ప్రచారం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌, గజపతినగరం : సర్వమత సామరస్యమే భారతీయ జీవన విధానమని, తరతరాలుగా అలాగే జీవిస్తున్నారని, జాతీయోద్యమంలో కూడా హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు ఐక్యంగా బ్రిటీష్‌ పాలకులు పై తిరుగుబాటు చేసిన చరిత్ర ఉన్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు అన్నారు. అటువంటి భారత దేశంలో మత ప్రాతిపదికన విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని. అందులో భాగంగానే విజయవాడ కేంద్రంగా విహెచ్‌పి హైందవ శంఖారావం సభ జరిపి అబద్ధాలు అర్ధ సత్యాలు ప్రచారం చేసిందని ఆయన అన్నారు. ఎందరు ఎన్ని కుట్రలు చేసినా మతసామరస్యాన్ని, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడుకుంటామని అన్నారు. దేశ సమైక్యత, మతసామరస్యం, రాజ్యాంగ పరిరక్షణకై దేశ వ్యాప్తంగా సిపిఎం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్‌విఎన్‌ నగర్‌, రామకృష్ణా నగర్‌లో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదుల పైదాడులు, దేవాలయాల కబ్జాకు ప్రయత్నిస్తున్న మతోన్మాదుల ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం. శాంతమూర్తి, ఎం. జగదాంబ, కె.రమణమ్మ, లింగమూర్తి పాల్గొన్నారు .

గజపతినగరం మండలం బంగారమ్మపేటలో సిపిఎం నాయకులు జి.శ్రీనివాస్‌ ఆధ్వర్యాన ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం అనేక కులాలు, మతాలు, జాతులు కలగలిపిన వైవిధ్యం కలిగిన లౌకిక భారతదేశమని, అత్యంత ప్రజాస్వామ్యకమైన హక్కులు కలిగిన విలువలకు పీటవేసిన రాజ్యాంగం మనదని వివరించారు. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్‌ వాడిని తరిమికొట్టేందుకు అన్ని మతస్తులు కులస్తులు ఐక్యమై స్వాతంత్య్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనకుండా ఉన్న బ్రిటిష్‌ వారికి సహకరించిన ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాలు, దాని అనుబంధ రాజకీయ పార్టీ బిజెపి ఇప్పుడు దేశంలో మతసామరస్యానికి విఘాతం కలిగించే చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతనే అమిత్‌ షా అవమానించడం దౌర్భాగ్యమని అన్నారు. మను ధర్మం అమలు చేయడమంటే అంటరానితనం, కుల వివక్షత, ప్రజాస్వామ్యకు హక్కుల అణిచివేతకు బలవ్వడమేనని అన్నారు. ఈనేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని అన్నారు. కార్యక్రమంలో తెర్లాపు కృష్ణ, కంటురాము, కంటు ఎల్లయ్య, కంటులక్ష్మణ, దేవరపల్లి రమణ, కంటి గురయ్యా తదితరులు పాల్గొన్నారు.

➡️