ప్రజాశక్తి- వేటపాలెం : కోర్టు వివాదం ఉన్న స్థలలోని ఆక్రమణలను అధికారులు శనివారం తొలగించారు. ఆ స్థలంలోకి ఎవరు ప్రవేశించకుండా సిఆర్‌పిసి 145 ఆర్డర్‌ను తహశీల్దారు పి.పార్వతి జారీ చేశారు. వివరాల ప్రకారం.. 1969లో ఇండియా, శ్రీలంక అగ్రిమెంట్స్ ప్రకారం 1980లో శ్రీలంక నుంచి సుమారు 250 కుటుంబాల వారు ఇండియాకు వచ్చారు. భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లులో కుటుంబానికి ఒకరికి చొప్పున ఉద్యోగం ఇచ్చింది. కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయంలో రాష్ట్ర ప్రభుత్వం కాందీశీకుల కోసం వేటపాలెం మండలం దేశాయిపేటలోని సర్వే నెం.370,371లో ఎ9.99 సెంట్ల స్థలం కేటాయించింది. అందులో 152 గృహాలు నిర్మించారు. 1990లో రెండవ సారి చీరాల కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు మూతబడిన సమయంలో కాందీశీకుల్లో కొంత మంది ఉద్యోగ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అదే సమంలో స్థానికులు ఆ కాలనీలోని 27 గృహాలను ఆక్రమించారు. ఆ గృహాలను ఖాళీ చేయాలని బాధితులు కోరారు. అయినప్పటికీ ఆక్రమణ ారులు ఖాళీ చేయలేదు. గత్యంతరం లేక 1995లో హైకోర్టును ఆశ్రయించారు. 2006 అక్టోబర్ 5న ఆక్రమణలు తొలగించి సర్వేనెం.370,371లోని ఎ. 9.99 సెంట్లలో కాందీశీలకు పట్టాలు హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఆక్రమణదారులు ఖాళీ చేయలేదు. దీంతో హైకోర్టును తీర్పును అమలు చేయాలని కాందీశీకులు కలెక్టర్, ఆర్‌డిఒ, తహశీల్దారుకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ హైకోర్టు తీర్పు అమలు కాలేదు. అదేవిధంగా వేటపాలెం గ్రామ సర్వేనం 370లోని 4.50 సెంట్ల భూమి విషయంలో విద్యుత్ అధికారులు, కాందీశీల మధ్య కోర్టులోనూ వివాదం జరుగుతుంది. ఈ క్రమంలో కాలనీ వాసులు ఆ స్థలంలో చిన్న చిన్న రేకులు షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విద్యుత్ ఎఇ రవితేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దారు పార్వతి, ఎస్‌ఐ మీసాల వెంకటేశ్వర్లు, విఆర్‌ఒలు వివాదా స్పద స్థలం వద్దకు వెళ్లారు. కాలనీ వాసులు, విద్యుత్ అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆక్రమణలు తొలగించారు. ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లరాదని సిఆర్‌పిసి 145 ఆర్డర్ జారీ చేస్తూ అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.
