కనిగిరిలో ఆక్రమణల తొలగింపు

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని బొడ్డుచావిడి వద్ద ఆక్రమణల తొలగింపు శనివారం కొంతమేర ఉద్రిక్తతకు దారితీసింది. బొడ్డు చావడి నుంచి నాజ్‌ సెంటర్‌, రామాలయం వీధి, దొరువు బజారు వరకు ప్రధాన రహదారి ఇరువైపులా సైడ్‌ కాలువల మీద ఉన్న నిర్మాణాలను మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. తొలుత ఇళ్ల యజమానులకు ఆక్రమణల తొలగింపుపై సచివాలయ సర్వేయర్లు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వలేదని మున్సిపాలిటీ అధికారుల వద్ద వాపోయారు. ఆక్రమణల తొలగింపునకు మరికొంత సమయం ఇవ్వాలని టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ స్వర్ణ కుమార్‌, ఎస్‌ఐ శ్రీరాంతో ఇళ్ల యజమానులు, వ్యాపారులు కోరారు. ఈ క్రమంలో మున్సిపాలిటీ అధికారులు సైడ్‌ కాలువల మీద ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో మార్కింగ్‌ ఇస్తామని అప్పుడు ఇలా యజమానులు స్వచ్ఛందంగా ఆక్రమణల్లో తొలగించుకోవాలని తెలిపారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అధికారులు స్వచ్చందంగా ఆక్రమణలను తొలగించుకోవాలని పిలుపునిచ్చారు.

➡️