మూడు రోజుల్లో ఆక్రమణలు తొలగించండి: సిఐ

ప్రజాశక్తి-పామూరు పామూరు పట్టణంలో ఇరువైపులా దుకాణదారులు సైడ్‌ కాలువలు దాటుకొని రోడ్డును ఆక్రమించి బోర్డులు పెట్టారని, మరికొందరు రూములు కట్టారని, మూడు రోజుల్లో ఈ నెల 29వ తేదీ నాటికి వాటిని తొలగించకపోతే జెసిబి ద్వారా తామే తొలగిస్తామని పామూరు సిఐ భీమానాయక్‌ అన్నారు. పట్టణంలోని ఇరువైపులా దుకాణాల యజమానులు, చిరు వ్యాపారులను, సోమవారం ట్రాఫిక్‌ సమస్యపై అవగాహన సభ సిఐ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐ భీమానాయక్‌ మాట్లాడుతూ పట్టణంలోని కనిగిరి రోడ్డు నుంచి నెల్లూరు రోడ్డు వరకు సైడ్‌ కాలువలు ఉన్నాయి. కాలువ దాటి ఎవరూ ముందుకు రావాల్సిన పనిలేదని, అలా వచ్చినవారు ఈ నెల 30వ తేదీ నాటికి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. దుకాణాల ముందు తోపుడు బండ్లను, పెట్టించి వారి వద్ద బాడుగుల పేరుతో అధికంగా డబ్బులు లాగుతున్నారని తెలిపారు. నడిరోడ్డులో తోపుడు బండ్లు పెట్టడం వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎవరైనా ట్రాఫిక్‌ సమస్యకు ఆటంకం కలిగిస్తే, చట్టాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిం చారు. గౌరవంగా బతికే వారికి ఫ్రెండ్లీ పోలీసులా ఉంటామని, ప్రజలను ఇబ్బందికి గురిచేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి దుకాణం లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పట్టణ అభివృద్ధికి, ట్రాఫిక్‌ సమస్య నియంత్రణకు సహకరించాలని కోరారు. ఎవరికైనా ఏ సమస్య వచ్చినా వెంటనే ఫోన్‌ చేయాలని, తాము అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ సమావేశానికి దుకాణ యజమానులు, చిరు వ్యాపారులు హాజరయ్యారు.

➡️