మూడు వంతెనలు పున: ప్రారంభం

Mar 8,2025 23:53

మూడు వంతెనలను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరులో పలు అభివృద్ధి పనులను కేంద్ర గ్రామీణాభావృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ శనివారం పరిశీలించారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన నందివెలుగు బ్రిడ్జి పనుల పూర్తికి కేంద్రం నుంచి రూ.36 కోట్లు మంజూరు చేయించినందుకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నశీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి సత్కరించారు. అనంతరం డొంకరోడ్డులోని మూడు వంతెనల రైల్వే బ్రిడ్జి పనులను మంత్రి ప్రారంభించారు. దాదాపు నాలుగు నెలల తరువాత ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నందివెలుగు బ్రిడ్జి పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని, శంకర్‌ విలాస్‌ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులను వచ్చేనెల ప్రారంభిస్తామని తెలిపారు. మూడు వంతెనల దగ్గర గతంలో ఉన్న రెండు ట్రాక్‌లను రూ.5.50 కోట్లతో నాలుగు ట్రాక్‌లు చేయగా ఈ ప్రాంతంలో ఇక డ్రెయినేజీ సమస్య ఉండబోదన్నారు. మూడు వంతెనల ప్రాంతంలో మాస్టర్‌ ప్లాన్‌ మేరకు 60 అడుగులు రోడ్డు విస్తరణకు స్థానిక ప్రార్థన మందిరాల మతపెద్దలు, ప్రజలు సహకరించాలని కోరారు. నగరంలో ఇప్పటికే పలు దేవాలయాలు, చర్చిలు, మసీదులు, విగ్రహాల వల్ల తీవ్ర ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయని, అందరి సహకారంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యనూ పరిష్కరిస్తామన్నారు. కమిషనర్‌ పి.శ్రీనివాసులు మాట్లాడుతూ శంకర్‌ విలాస్‌, పెద పలకలూరు, గడ్డిపాడు వద్ద ఆర్‌వోబీలు మంజూరయ్యయని, రోడ్లు, డ్రెయిన్లు, వీధిలైట్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల్లో పెనుమార్పుల ద్వారా గుంటూరును కార్పేరేట్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ గుంటూరు తూర్పు – పశ్చిమ నియోజకవర్గాలకు ప్రధానమైన వారధి అయిన మూడు వంతెనల రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరణ, అభివృద్ధి అవసరమని, పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. అనంతరం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడారు. జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, ఏ.పి టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, ఏ.పి ఇండిస్టియల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డేగల ప్రభాకరరావు, డిప్యుటీ మేయర్‌ షేక్‌ సజీల, జిఎంసి ఎస్‌ఇ నాగమల్లెశ్వరరావు, ఇఇ సుందర రామిరెడ్డి, సిపి రాంబాబు, కార్పొరేటర్లు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

➡️